AP MINISTERS ON SAKSHI TV AND PAPER : శాసనమండలిలో జరిగే వ్యవహారాలను వక్రీకరిస్తూ సాక్షి పేపర్, టీవీల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శాసన మండలి ఛైర్మన్‌ను ఏపీ మంత్రులు కోరారు. సాక్షి టీవీ, పేపర్లో జరుగుతోన్న దుష్ప్రచారంపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు స్పష్టంగా సమాధానం ఇచ్చినా నీళ్లు నమిలారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లేనివి ఉన్నట్లుగా కల్పించి సాక్షి పేపర్, టీవీ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని అచ్చెన్నాయుడు సభ దృష్టికి తెచ్చారు. తమకు పేపర్, టీవీ ఉందని వైఎస్సార్సీపీ వారు అన్నీ అబద్దాలే చెప్పిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శాసనసభ వ్యవస్థకు పోటీగా మరో వ్యవస్థను సృష్టించేలా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని మంత్రి పార్థసారథి అన్నారు. అసెంబ్లీ, శాసనమండలి ప్రశ్నోత్తరాలపై జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక సమాంతర వ్యవస్థను నడుపుతోందని మంత్రి పార్థసారధి ఆరోపించారు. సభ్యులు శాసన సభకు రాకుండానే ఇష్టమొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.
శాసనసభ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా సాక్షి, వైఎస్సార్సీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు దమ్ముంటే శాసన సభకు వచ్చి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సవాల్ చేశారు. తప్పుడు ప్రచారం చేస్తోన్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. ఈ తరహా విధానానికి చెక్‌పెట్టాలని శాసనమండలి ఛైర్మన్‌ను కోరారు.
"బ్లూ మీడియా"లో ఎలాంటి మార్పూ రాలేదు - పరువు నష్టం కేసు గెలుస్తాం: లోకేశ్