YS Sunitha on Varra Ravinder Posts : పులివెందులకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ను కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం పులివెందుల నుంచి హైదరాబాదుకు వెళ్లే క్రమంలో కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీత ఎస్పీని కలిశారు. వివేకా హత్య కేసు అంశంపైన ఆమె కొత్త ఎస్పీకి వివరించినట్లు సమాచారం. దాంతోపాటు ఇటీవల అరెస్టు అయిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి తమపై అసభ్యకరంగా పెట్టిన పోస్టులను కూడా సునీత ఎస్పీకి వివరించినట్లు తెలిసింది.
ఈ ఏడాది జనవరిలో సునీత, షర్మిల, విజయమ్మపైన వర్రా రవీందర్ రెడ్డి ఏ విధమైన పోస్టులు పెట్టారు, అసభ్యకరంగా ఎలా పోస్టులు షేర్ చేశారనే అంశంపైన సునీత ఎస్పీకి వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే తాను హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ కేసు వివరాలను కూడా తెలియజేసినట్లు సమాచారం. షర్మిల కూడా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయగా, వర్రా రవీందర్ రెడ్డిపై కేసు నమోదు అయిందని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రవీందర్ రెడ్డిపైన మరింత కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సునీత ఎస్పీ విద్యాసాగర్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఎస్పీ కార్యాలయం వద్ద వివేక తల్లి సౌభాగ్యమ్మ వాహనంలోనే ఉన్నప్పటికీ, కేవలం సునీత మాత్రమే వెళ్లి ఎస్పీని కలిసి వచ్చారు. అనంతరం కడప విమానాశ్రయం నుంచి సునీత కుటుంబ సభ్యులు విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
వైఎస్సార్సీపీ 'సోషల్' సైకోలపై గురి - త్వరలోనే వారందరికీ 41 ఏ నోటీసులు