ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం - విలీన గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి - Neglect on Merged Villages

YSRCP Government Neglect on Merged Villages: వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మచిలీపట్నం నగర పాలక సంస్థలో విలీనానికి ప్రతిపాదించిన 9 గ్రామాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆటు పాలక వర్గాలు లేక ఇటు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల అభివృద్ది నిలిచిపోయింది. తమ గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ వంటి సమస్యలు పరిష్కరించే నాథుడే లేరని ప్రజలు వాపోతున్నారు.

YSRCP_Government_Neglect_on_Merged_Villages
YSRCP_Government_Neglect_on_Merged_Villages

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 7:09 PM IST

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం - విలీన గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి

YSRCP Government Neglect on Merged Villages : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో 34 పంచాయతీలు ఉండగా వాటిలో సుల్తానగరం, అరిశేపల్లి, పోతేపల్లి, చినకరగ్రహారం, పెదకరగ్రహారం, మేకవానిపాలెం, గరాలదిబ్బ, రుద్రవరం, ఎస్ఎన్ గొల్లపాలెం ఈ తొమ్మిది పంచాయతీలను గతంలో నగర పాలక సంస్థలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత ఆ ప్రక్రియ వివిధ కారణాలతో ఆగిపోయింది. దీంతో ఆ గ్రామాలు అటు నగరంలో కలవక, ఇటు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించపోవడంతో పాలక వర్గాలు కూడా లేకపోవడంతో ప్రజలు సమస్యలతో సహజీవనం చేయాల్సిన దుస్థితి దాపురించింది. 15వ ఆర్ధిక సంఘ నిధుల్లో పంచా యతీలకు 70శాతం కేటాయిస్తారు. వాటిలో టైడ్ ఫండ్స్ ను తాగునీరు, పారిశుద్ధ్యం, నీటి వనరుల సంరక్షణ, తదితర పనులకు వెచ్చించాల్సి ఉంటుంది. ఆన్ టైడ్ ఫండ్స్ పంచాయతీల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల జీతభత్యాలకు మినహాయించి మిగిలిన పనులకు వెచ్చించడానికి అవకాశం ఉంది. మండలంలో అన్ని పంచాయతీలకూ ఎంతో కొంత ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. వీటికి మాత్రం కేవలం పాలకవర్గాలు లేవన్న కారణంతో నిధులు విడుదల కావడం లేదు. దీంతో గ్రామాల్లోని సమస్యలు పట్టించుకునే వారు లేరు.

గతంలో జనాభా ప్రాతి పదికన ఒక్కో పంచాయతీకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆర్ధిక సంఘ నిధులు వచ్చేవి. గత కొన్నేళ్లుగా వీలిన గ్రామాలకు ఆ నిధులు ఆగిపోయాయి. పంచాయతీలకు ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా లక్ష నుంచి 2 లక్షలు దాటడం లేదు. అది కూడా సక్రమంగా వసూలైతేనని సిబ్బంది అంటున్నారు. ప్రధానంగా అన్ని గ్రామాల్లోనూ డ్రైనేజీ వ్యవస్థ ఆధ్వానంగా తయారయ్యింది. పోతేపల్లి, సుల్తానగరం, ఎస్ఎన్ గొల్లపాలెం తదితర గ్రామాల్లో డ్రైయిన్లు లేక మురుగు రహదారులపై చేరుతోంది. అరిశేపల్లి పంచాయతీ పరిదిలోని హుస్సేన్ పాలెం నుంచి చిట్టిపాలెం వెళ్లే రహదారిపై మురుగు చేరడంతో ప్రజలతో పాటు రాక పోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన అంశంపై హైకోర్టులో విచారణ

ఇదే పంచాయతీ బైరాగి పాలెం వెళ్లే రోడ్డులో ముళ్లపొదలు రహదారిపైకి చొచ్చుకు వస్తున్నాయి. కనీసం జంగిల్ క్లియరెన్స్ కూడా చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. అరిశేపల్లి పంచాయతీలో చిట్టిపాలెంలో లింకురోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. గ్రామాల్లో పబ్లిక్ కుళాయిలు ట్యాపులు పాడైనా నెలల తరబడి మరమ్మతులు కూడా చేయడం లేదని అంటున్నారు. చెత్త సంపద కేంద్రాలు అన్నీ అలంకారంగా మారిపోయాయి. క్లాప్ మిత్రాలకు జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడా విదులు మానేస్తున్నారు. సుల్తానగరంలో ఫిల్టరెడ్లు పాడైపోయాయి. ఇలా ఆయా గ్రామాల్లో ఎక్కడ సమస్యలు అక్కడే అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి పంచాయతీ కార్యదర్శులు కూడా తాము ఏమి చేయలేదని చెప్పడంతో ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాలను విలీనం చేయాలంటూ నిర్ణయం చేసి సంవత్సరాలు గడుస్తున్నా వీటిపై పాలకులు దృష్టి సారించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మచిలీపట్నంలో ఉన్న ఏకైక మండలాన్ని రెండుగా విభజించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మండల పరిధిలోని తొమ్మిది గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేయాలంటూ ఏనాడో చేసిన ప్రతిపాదనలు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విలీన ప్రతిపాదన అటకెక్కిన దగ్గర నుంచి మచిలీపట్నంలోని 9 గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న ప్రజలు తాము పంచాయతీ, పురపాలక సంఘాల్లో దేని పరిధిలో ఉన్నామో తెలియని ఆమోమయ పరిస్థితుల్లో ఉన్నారు.

విజయనగరం నగరపాలక సంస్థలో కలిసినా.. తప్పని తిప్పలు

పాలక వర్గాలు లేకపోవడంతో స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ప్రత్యేక అధికారుల దయదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. మిగిలిన పంచాయతీల తరహాలోనే అభివృద్ధికి నోచుకోక నగరపాలక సంస్థ పరంగా అందాల్సిన ప్రయోజనాలు దక్కకపోవడంతో రాజ్యాంగబద్ధమైన స్వయం పరిపాలనకు దూరంగా ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అవసరం మేర నిధులు మంజూరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ గ్రామాలపై ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి చేయాలని మొర పెట్టుకుంటున్నా ఆలకించే వారే లేరని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాల అభివృద్దికి దారి చూపాలని కోరుతున్నారు.

"ఎప్పటినుంచో మా గ్రామాలను కార్పొరేషన్​లో కలపడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. కానీ ఇప్పటికీ వారి మాటలు కార్యరూపం దాల్చలేదు. దీని కారణంగా గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోవడం లేదు. ఏ సమస్య వచ్చిన ఏ అధికారికి చెప్పాలో అర్థం కావడం లేదు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. కార్పొరేషన్​లో కలిస్తే డ్రైనేజీలు బాగు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు."- విలీన గ్రామస్థులు

విలీన గ్రామాల సమస్యలపై హోంమంత్రి సుచరిత సమీక్ష

ABOUT THE AUTHOR

...view details