NO Skill Universities in YSRCP Government : రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని దానికి అనుబంధంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ 16న సమీక్షలో సీఎం జగన్ నిర్దేశించారు. ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన వారికి ఈ వర్సిటీ, స్కిల్ సెంటర్లు అండగా ఉంటాయని అక్కడ మంచి సదుపాయాలు కల్పించి, బోధకులను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఐదేళ్ల పాలనలో నైపుణ్య వర్సిటీలనే ఏర్పాటు చేయలేకపోయారు. కళాశాలలకు భవనాలు నిర్మించలేక ఖాళీగా ఉన్న భవనాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. యువతకు శిక్షణ పెంచకపోగా మరోవైపు ఉన్న కేంద్రాలను మూసేశారు. చివరికి ఏవో దొంగ లెక్కలు రాసి, లక్షల మందికి ఇచ్చినట్లు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Skill Universities in AP :నైపుణ్య కళాశాలల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణంటూ నిరుద్యోగ యువతకు సీఎం జగన్ అరచేతిలో వైకుంఠం చూపారు. మన యువత ప్రపంచంతో పోటీ పడాలంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇంజినీరింగ్ చేసే యువతకు విశాఖపట్నంలో ఉన్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయం, తిరుపతిలో మరో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి, చివరికి అటకెక్కించారు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25, అయిదు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 30 నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి ట్రిపుల్ ఐటీల్లో ఏర్పాటు చేయాల్సిన నాలుగింటిని మూలన పడేశారు.
CM Jagan Rush for Skill Universities: 30 నైపుణ్య కళాశాలలంటూ జగన్ ప్రకటనలు.. 30శాతం యువత ఆశలపై నీళ్లు
మిగతా వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవనాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ఒక్కో కళాశాల భవన నిర్మాణానికి 20కోట్లు చొప్పున 580కోట్లు కేటాయించలేక చేతులెత్తేశారు. కళాశాలల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకూ జగన్ సర్కార్‌కు మనసు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana) కింద ఇస్తున్న నిధులతో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల్లో శిక్షణకు యువత ఆసక్తి చూపడం లేదంటే దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలు మొదలే కాని వర్సిటీలు, మొక్కుబడిగా సాగుతున్న కళాశాలల్లో కోర్సుల అమలు పేరుతో జగన్ సర్కారు ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ఒక్కటీ అమల్లోకి రాలేదు. కేంద్రం ఇస్తున్న నిధుల కోసం డీడీయూజీకేవై కోర్సులనే అమలు చేస్తున్నారు. 120 కోర్సుల్లో అంతర్జాతీయ స్థాయిలో బోధన, శిక్షణ ఇస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు తూతూమంత్రంగా సాగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఏటా 2 లక్షల 30 వేల మంది డిగ్రీ ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో 40శాతంలోపు మందికే ఉద్యోగాలు వస్తున్నాయి.ఈ లెక్కన ఏటా లక్షా 38వేల మందికి నైపుణ్య శిక్షణ అవసరం. కానీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న 26 నైపుణ్య కళాశాలల్లో ఏటా గరిష్ఠంగా 6 వేల240మందికే శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే మిగతా వారు సొంతంగా డబ్బులు వెచ్చించి శిక్షణ పొందాల్సిందే.
స్కిల్ సెంటర్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్ - అనంతరం వెబ్సైట్ ఆవిష్కరణ