Construction of Amaravathi City : రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏపీ భవిష్యత్తును ఫణంగా పెట్టి మరీ తిరోగమన చర్యలతో నాశనం చేసింది. మూడు రాజధానుల పేరుతో మొగ్గ దశలో ఉన్న అమరావతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది. అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసింది. టీడీపీ హయాంలో ముమ్మరంగా సాగిన అమరావతి పనుల్ని 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసింది. ఐదేళ్ల పాటు రాజధానిని పాడుబెట్టింది. చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్వవైభవం తీచ్చే చర్యలు మొదటి రోజు నుంచే ప్రారంభించింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో మార్గసూచిని సిద్ధం చేసుకుంటోంది.
రాజధాని పునర్నిర్మాణం సీఎం చంద్రబాబుకు సవాలుగా మారనుంది. ఈ ఐదేళ్లలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, భవిష్యత్తులో మరొకరు జగన్‌లా విధ్వంస ఆలోచనలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరం ఉందని రాజధాని రైతులు కోరుతున్నారు. ఆచరణాత్మక లక్ష్యాలు నిర్దేశించుకొని తన హయాంలోనే అందరి ఆశలు నెరవేరుస్తూ మొదటి దశను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన గురుతర బాధ్యత బాబు భుజస్కంధాలపై ఉందని చెప్తున్నారు.
అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్‌మెంట్లు 72 శాతం, ఎన్జీవోల నివాస సముదాయాలు 62 శాతం, గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణం 65 శాతం మేర పూర్తయ్యాయి. పెండింగ్ పనుల్ని వెంటనే ప్రారంభించాల్సి ఉంది. కేబినెట్ సబ్‌కమిటీ అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి చర్యలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కాలపరితితో కూడిన నివేదిక సిద్ధం చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, నిపుణుల కమిటీ, ఐఐటీ రూర్కీ, హై పవర్ కమిటీల తుది నివేదికలను సమీక్షించి తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది.
టీడీపీ హయాంలో ప్రారంభమైన విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు ఐదేళ్లుగా పునాదుల స్థాయిలోనే నీటిలో నానుతున్నాయి. ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయించాల్సి ఉంది. కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకొని ఆ పనులను సవరించిన అంచనాలతో తిరిగి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఐదేళ్లలో ఇవి పూర్తయ్యేలా చూడాలి. దీనికి గాను గుత్తేదారులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు, మొబలైజేషన్ అడ్వాన్సులు, గడువు పొడిగింపు, ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా? లేక తిరిగి టెండర్లు పిలవాలా? అనే అంశాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పెండింగ్ భూసేకరణ, రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయ చిక్కులను సత్వరమే పరిష్కారం చేయాలి. అనంతరం ఆ భూములను సీఆర్‌డీఏకు తిరిగి దఖలు పరిచేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీసీఈడీఏ చట్టం, పునర్విభజన చట్టం, అమరావతి బృహత్ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు న్యాయపరమైన చర్యలను ప్రారంభించాలి. రైతుల రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేసి వీలైనంత త్వరగా లాస్ట్ మైల్ కనెక్టివిటీతో వారి ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలి. దీని వల్ల రాజధానిలో నివాసయోగ్యత స్థాయి పెరుగుతుంది.