YSRCP Govt Eye on Assigned Lands: ఇరవై ఏళ్ల కంటే ముందు ఎసైన్ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ 2023 జులై 31 నుంచి అమల్లోకి వచ్చేలా చట్టసవరణ చేస్తూ గతేడాది అక్టోబర్ 27న వైఎస్సార్సీపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీఓ జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని ఎసైన్డ్ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో, పణమో ముట్టచెప్పి అక్కడ నుంచి తరిమేస్తున్నారు. అంగీకరించకపోతే బెదిరించి, భయపెట్టి లాక్కుంటున్నారు. విశాఖ వంటిచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటిచోట్ల 50- 70శాతం వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన దళితుల భూములదీ ఇదే పరిస్థితి.
పది రోజుల్లోనే ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు: జీఓ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాయలసీమ సహా పలుచోట్ల ఎసైన్డ్ భూముల కుంభకోణం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా వేల కోట్ల ఎసైన్డ్ భూముల కుంభకోణం ఉత్తరాంధ్రను కుదిపేస్తోంది. ఇందులో కొందరు అధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. భోగాపురం, విశాఖపట్నం పరిధిలోని ఎసైన్డ్ భూముల జాబితాలు దగ్గర పెట్టుకుని, వారి దగ్గర నుంచి సుమారు వెయ్యి ఎకరాల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. భోగాపురం పరిధిలో బసవపాలెం గ్రామంలో 62 మంది రైతుల నుంచి 45 ఎకరాలను 10 లక్షల చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జీఓ 596 విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి ఎసైన్డ్ భూములు అగ్రిమెంట్ చేసుకుని సవరణ జీఓ వచ్చాక పది రోజుల్లోనే ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయి.
ఎన్నికల కోడ్ ఉండగానే: విశాఖ జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలతోపాటు, విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అర్హులైన పేదల ఎసైన్డ్ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం, కీలక అధికారులు ఒప్పందాలు చేసుకున్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లకు మాత్రమే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు మంజూరు చేయడమూ అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నం జిల్లా పరిధిలో సుమారు 2 వేల ఎకరాల ఎసైన్డ్ భూములున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో పద్మనాభం, ఆనందపురం పరిధిలో మొదటి విడతగా సుమారు 367 సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్ చేశారు. ఎలక్షన్ కోడ్ ఉండగానే ఆనందపురంలో 22 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ మరో జాబితాను పంపారు.