YSRCP Government Conspiracy on Amaravati: అమరావతిని ధ్వంసం చేయడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తోంది. భూములిచ్చిన రైతులకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో జగన్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, అమరావతిపై మరో కుట్రకు తెరలేపింది.
రైతుల ఆమోదం అవసరమే లేకుండా బలవంతంగా ప్రత్యామ్నాయ ప్లాట్లను అంటగట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే రైతుల ప్రయోజనాలు దెబ్బతినడంతోపాటు అమరావతి మాస్టర్ ప్లాన్‌కు సైతం తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. భూసేకరణలోని ప్రాంతాల్లో కేటాయించిన ప్లాట్లను మార్చి ప్రస్తుతం వేరొక చోట ఇచ్చేందుకు సీఆర్డీఏ ఇటీవలే సంబంధిత రైతులకు నోటీసులు ఇచ్చింది. వీటికి సమ్మతి తెలిపిన వారికి రెండు దశల్లో ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ-లాటరీ ద్వారా కేటాయించింది.
హౌసింగ్ ప్రాజెక్టు నిరర్థక ఆస్థిగా మిగిలిందా అంతే సంగతి - జగన్ సర్కారు వైఖరితో రుణ సంక్షోభంలో సీఆర్డీఏ
రైతుల సమ్మతి లేకుండానే:ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగా భూసేకరణ భూముల్లోని ప్లాట్లను రద్దు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇంకా అంగీకారం తెలపని రైతులకు వారితో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా కసరత్తు పూర్తి అయింది. రైతుకు రిటర్నబుల్ ప్లాట్ కానీ, ప్రత్యామ్నాయ ప్లాట్ కానీ కేటాయించాలంటే ముందుగా ముసాయిదా లే ఔట్ ప్లాన్ సిద్ధం చేసుకుని దానిపై సూచనలు, అభ్యంతరాల్ని తీసుకోవాలి.
అభ్యంతరాలు ఏమైనా ఉంటే, నిబంధనలకు లోబడి వాటిని పరిష్కరించి, ఫైనల్ లే ఔట్‌ను సీఆర్డీఏ కమిషనర్ ఆమోదంతో సిద్ధం చేయాలి. తర్వాతే లాటరీ తీసి సంబంధిత ప్లాట్లను కేటాయించాలి. అయితే జగన్ ప్రభుత్వం ఈ నిబంధనల్ని మార్చి, ప్రక్రియను వేగంగా ముగించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా రైతుల ఆమోదం లేకుండా ప్లాట్లను కేటాయించేందుకు పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి ఇటీవల న్యాయ సలహా కోరారు.
రాజధాని రైతులపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు - నాలుగేళ్లలో 3 వేల మందిపై కేసులు
ప్రభుత్వం ఆశించిన విధంగానే హైకోర్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నుంచి సలహా వచ్చింది. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహించారు. ఇందులో ఎజెండా నం.452 ద్వారా రైతుల సమ్మతి లేకుండానే ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. కొత్త నిబంధన ప్రకారం ఇక మిగిలిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను అంటగట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
నిబంధనలు పాటించకుండా లాటరీ తీసి ప్లాట్లను కేటాయించడం వల్ల రైతుల హక్కులకు భంగం వాటిల్లుతుంది. ఎక్కువగా వీధిపోటు ప్లాట్లు రావడానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే రెండుసార్లు తీసిన లాటరీల్లో 30 శాతానికిపైగా ఈ రకమైనవే వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత భూసేకరణ ప్రకటనను ఉపసంహరించాలనేది ప్రభుత్వ ప్లాన్. భూసేకరణలో ఉన్న భూముల్ని తిరిగి రైతులకు ఇచ్చేయడం వల్ల మళ్లీ సమస్య మొదటికే వస్తుంది. దీనిని పరిష్కరించడం రాబోయే ప్రభుత్వానికి కష్టమవుతుంది. ఇలా అమరావతి మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసే కుట్రకు వైసీపీ సర్కారు తెరదీసింది.
విశాఖకు కార్యాలయాల తరలింపు కోర్టు ధిక్కారమే : ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతుల ఆగ్రహం