YSRCP Goverment Illegal Gravel Mining in Guntur District : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన గ్రావెల్ మాఫియా అంతా ఇంతా కాదు. పేదల సొంతింటి కల నిజం చేస్తామంటూ రూ. కోట్లు ఖర్చు చేసి రైతుల భూమిని జగన్ సర్కార్ కొనుగోలు చేసింది. గుంటూరు నగర శివార్లలో జగనన్న మున్సిపల్ కాలనీ పేరుతో వేల మంది పేదలకు ఆర్భాటంగా ప్లాట్లు పంపిణీ కూడా చేశారు. అయితే, ఆ స్థలాలను మెరక చేయాల్సింది పోయి కొంతమంది నేతలు కాసులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా గ్రావెల్ తవ్వకాలు ఆపకపోవడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి.
సజ్జల కనుసన్నల్లో మైనింగ్ మాఫియా - ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ దౌర్జన్యకాండ - ILLEGAL MINING OF QUARTZ
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించింది. ఈ స్థలాల కోసం కొర్నెపాడు, పేరేచర్ల తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొని ఇంటి స్థలాలుగా మార్చింది. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామ పరిధిలో 334 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందు కోసం ఎకరానికి 46 లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ. 153.64 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ 15 వేల మందికి పైగా నిరుపేదల కోసం ప్లాట్లు కేటాయించారు. అయితే, పట్టాలు ఇచ్చిన స్థలాలను మెరక చేసి పేదలు ఇళ్లు నిర్మించేందుకు అనువుగా చేయాల్సిన తరుణంలో వైఎస్సార్సీపీ నేతలు మట్టి తవ్వకాలు చేపట్టారు. 25 అడుగులకు పైగా లోతులో గుంతలు తవ్వి ఏమాత్రం నివాస యోగ్యం కాకుండా చేస్తున్నారు. సుమారు 5 కోట్ల రూపాయలకు పైగా విలువైన గ్రావెల్ రాత్రివేళలో తరలించి అమ్ముకుంటున్నారు. పైగా స్థలాలన్నీ ఖాళీగా ఉండటంతో పిచ్చిమొక్కలు, కంప చెట్లు పెరిగి చిట్టడవిలా తయారవుతోంది. ఈ ప్రాంతానికి రావాలంటేనే లబ్ధిదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది.