Peddireddy Land Grabs in Mangalampeta :కోడి గుడ్లు పెట్టినట్లు, మేక పిల్లల్ని కన్నట్టు భూమి కూడా పిల్లల్ని కంటుందని ఎప్పుడైనా విన్నారా? పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజురోజుకూ పెరగడం ఎక్కడైనా చూశారా? అలాంటి అద్భుతాన్ని చూడాలంటే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే. అక్కడ భూమి రోజురోజుకూ పెరుగుతోంది. నమ్మకశక్యం కావడం లేదా? అయితే ఈ స్టోరీ చూసేయండి.
అటవిశాఖ మంత్రిని నేనే, నన్ను ఎవరు ప్రశ్నించే వారెవరు? అని అనుకున్నారో ఏమో? దట్టమైన అటవీ ప్రాంతం. మధ్యలో నున్నటి బీటీ రోడ్డు. ఆ దారిలో అలా ముందుకెళ్తే వందలాది మామిడి చెట్లు, పశువుల షెడ్లతో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం. అందులో ఓ పక్కన ఆధునికత ఉట్టిపడే అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా ఎవరిదంటారా? ఫ్యూడలిస్ట్ లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యంలో ఓ భాగం.
ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా సవాలక్ష అనుమతులు కావాలి. కానీ ఎకరాలకొద్దీ అటవీ భూముల్ని దర్జాగా కబ్జా చేసి, దాన్నో వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి, విలాసవంతమైన భవనం కట్టేశారు పెద్దిరెడ్డి! అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో అటవీభూమిలో రోడ్డు కూడా వేశారు! ఎవరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా దుర్భేద్యమైన ఇనుప కంచె వేయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో గత వైఎస్సార్సీపీ పాలనలో పెద్దిరెడ్డి నిర్మించుకున్న అక్రమ సామ్రాజ్యాన్ని ఈటీవీ భారత్ - ఈనాడు పరిశీలించాయి.
Peddireddy Land Grabs in Chittoor : అసైన్డ్, అటవీ భూముల్ని ఆక్రమించి రాజ భవనాలు కట్టుకోవడం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచీ వారికి అలవాటే. ఇడుపాయలయలో వందల ఎకరాలు ఆక్రమించి భవనాలు కట్టిన రాజశేఖర్‌రెడ్డి వివాదం రేగడంతో వాటిని తిరిగిచ్చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డిపైనా అటవీ భూములు ఆక్రమించి భవంతి కట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదేముంది? గుడినీ, గుడిలో లింగాన్నీ కలిపి మింగడంలో నిష్ణాతులైన వైఎస్సార్సీపీ నేతలందరికీ ఆయన పెద్దన్న.
ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి ప్రకృతి వనరుల్ని చెరబట్టి, వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఆయన కుటుంబ అరాచకాలకు అంతే లేదు. జగన్ జమానాలో రాష్ట్రవ్యాప్తంగా గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు అల్లాడుతున్నా కనీస మరమ్మతులు కూడా చేయలేదు. పెద్దిరెడ్డి మాత్రం అటవీశాఖ మంత్రిగా ఉంటూ అడవి మధ్యలోని వ్యవసాయ క్షేత్రానికి రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో తారు రోడ్డు వేసుకున్నారు.
Peddireddy Faimly Lands Encroachment :మంగళంపేట అడవిలోని సర్వే నంబర్ 295లో 17.69 ఎకరాలు, సర్వే నంబర్ 296లో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ -ఎఫ్‌ఎంబీలో స్పష్టంగా రికార్డయింది. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు 1952లో సర్వే చేసిన రికార్డులు చెబుతున్నాయి. అడవి మధ్యలో పట్టా భూమి ఉండటమే అరుదు. ఒకవేళ ఉన్నా ఎన్నేళ్లు గడిచినా ఆ భూమి అంగుళం కూడా పెరిగే అవకాశే లేదు.
కానీ మంగళంపేట అడవిలో భూమి పెరిగింది. రెండు సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉన్న 17.69 ఎకరాలతో మరో 6 ఎకరాలు కలిపితే 23.69 ఎకరాలు అవుతుంది. అయితే అదే సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుమారుడు మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేరిట 2000, 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దేశిరెడ్డి సర్వేశ్వర్‌రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములురెడ్డి, మంగమ్మల నుంచి భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. అంటే 23.69 ఎకరాల భూమి 45.8 ఎకరాలు అయిందన్నమాట.
ఈ గ్రోత్స్టోరీ అంతటితో ఆగలేదు. అడంగల్‌లో 295/1ఏ, 295/1బి, 295/1సి, 295/1డి, 296/1, 296/1బి సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరిట 75.75 ఎకరాలు ఉన్నట్టు నమోదైంది. అంటే 45.8 ఎకరాల భూమి 75.75 ఎకరాలకు పెరిగిందన్నమాట. 295/1ఈ సర్వే నెంబర్లోని మరో 1.8 ఎకరాల్ని అడంగల్‌లో డమ్మీగా చూపించారు. ఈ భూమే కాకుండా ఇంకో 30 ఎకరాల వరకు పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో ఉందనే అనుమానాలు ఉన్నాయి.