YSRCP Bad Position in Nellore and Prakasam District : వైఎస్సార్సీపీకి ఎదురులేని జిల్లాలుగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీకు ప్రస్తుత పరిణామాలు క్షణమొకయుగంలా మారాయి. పార్టీని ఇప్పుడు సిట్టింగులు ఒక్కొక్కరూ ఖాళీ చేసేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాజాగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడారు. ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్ఠానం అనర్హత వేటు కోసం స్పీకర్‌కూ ఫిర్యాదు చేసింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఇటీవల జనసేన టచ్‌లోకి వెళ్లారు. కీలక నేతలు పార్టీకి దూరమవడంతో పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది.
వాడీవేడిగా నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేల నిరసన గళం
వైసీపీకు ఆర్థికంగా దన్నుగా నిలిచిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా వైకాపా ఖరారు చేసినా ఆయన పార్టీలో మనలేక వెళ్లిపోయారు. ఆయనపైన, ఆయన భార్యపైన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యంగ్యంగా విమర్శించినా పార్టీ పెద్దలు నియంత్రించకపోగా సదరు ఎమ్మెల్యే అవకాశాలనూ పెంచారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోనన్న వేమిరెడ్డి విన్నపాలను కాదని లోక్‌సభ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. సర్దుకుపోతున్నప్పటికీ కనీసం గుర్తించకుండా అవమానిస్తుండడంతో మనస్తానికిగురై పార్టీకి గుడ్‌బై చెప్పారు.
YSRCP Situation in Nellore District : మేకపాటి కుటుంబంలో కీలకమైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి గత ఎన్నికల్లో ఆయన సిటింగ్ సీటు అయినప్పటికీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి అవకాశమివ్వలేదు. ఆయన కోరుకున్నట్టు తితిదే ఛైర్మన్‌గా నియమిస్తారన్న ప్రచారమూ సాకారం కాలేదు. ఆయన వారసుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి జగన్‌కు అండగా ఉండేవారు. గౌతమ్‌రెడ్డి మరణానంతరం ఆ కుటుంబం నుంచి గతంలో ఉన్నంత మద్దతు వైసీపీకు లభించడం లేదు. మరోవైపు ఆ కుటుంబంలోని మరో ముఖ్యుడు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీని వీడారు. చంద్రశేఖర్‌రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా నియమించారు. ఈ నియామకంతో అన్నదమ్ముల మధ్య వైఎస్సార్సీపీ అధిష్టానం చిచ్చుపెట్టిందా అన్న చర్చ జిల్లాలో మొదలైంది.
ఎమ్మెల్యే నల్లపరెడ్డిపై అసంతృప్తి - వైఎస్సార్సీపీకి పలువురు రాజీనామా
సీనియర్ నేత ఆనంను అవమానకరంగా వైసీపీ పంపేసింది. నెల్లూరు నగరం, గ్రామీణం, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఆనం రాంనారాయణరెడ్డి అనుచరగణం ఉంది. 2019 ఎన్నికల ముందు వైకాపాలో చేరిన ఆనంకు వెంకటగిరి టికెటైతే ఇచ్చారు కానీ. గెలిచాక ఎమ్మెల్యేగా ఆయనకు సముచిత ప్రాధాన్యం లభించలేదు. నియోజకవర్గంలో అభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైకాపా అధిష్ఠానం ఆయన్ను పక్కనపెట్టింది. వెంటనే వెంకటగిరి పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని సీఎం నియమించేశారు. చివరకు గత మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ ఆనంపై సస్పెన్షన్ వేటు వేశారు.
YSRCP Situation in Prakasam District: ఒకప్పుడు వైకాపాకు వీరసైనికుడిగా ఉండే కోటంరెడ్డి కోట దాటారు. ఓదార్పుయాత్ర నుంచే జిల్లాలో జగన్‌కు వీరసైనికుడిగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిలిచారు. 2014, 2019లో రెండుసార్లూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లోగానీ, 2022లోగానీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. పైగా నియోజకవర్గ అభివృద్ధి గురించి అధికారిక సమావేశంలో కోటంరెడ్డి ప్రశ్నించడాన్ని పార్టీ అధిష్ఠానం తప్పుపట్టింది. తన ఫోన్‌ను ట్యాప్ చేయించడాన్ని ఆయన ప్రశ్నించారు. తర్వాత ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఏకంగా అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.