YS Sunitha On Viveka Murder Case Latest :హత్యా రాజకీయాలు ఉండకూడదని, తన అన్న పార్టీ వైఎస్సార్సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కోరారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దని విన్నవించారు. అవినాష్, భాస్కర్‌రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారని, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అని చెప్పారు. వైఎస్ సునీతారెడ్డి దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..
'నేను ఎక్కడికి వెళ్లినా నా తండ్రి హత్యకేసు గురించే అడుగుతున్నారు. ఈ ఐదేళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బంది పడింది. నాకు అండగా నిలిచిన మీడియా, పోలీసు, లాయర్లకు కృతజ్ఞతలు. నాకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు. చంద్రబాబు, మహాసేన రాజేష్, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత గఫూర్ వంటి చాలామంది సహకరించారు. నా పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని తెలిపారు.
Viveka Murder Case Latest News :సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుందన్న సునీత, తన తండ్రి హత్య కేసు దర్యాప్తు మాత్రం ఎందుకు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ప్రశ్నించారు. 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారని, సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం. ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు, హంతకులు మనమధ్యే ఉంటారు. వాళ్లను కనుక్కోవాలి కదా?' అని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే అక్కడే ఉందన్న సునీత తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని కోరారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే న్యాయం జరుగుతుందని ఆశించారు.
YS Sunitha Fires on AP CM Jagan :మార్చురీ వద్ద అవినాష్ తనతో మాట్లాడారని, పెదనాన్న 11.30 వరకు తన కోసం ప్రచారం చేశారని చెప్పారని గుర్తు చేసుకుంటూ అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదని అన్నారు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని పేర్కొన్నారు. హత్య కేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారు. సీబీఐ దర్యాప్తునకు వెళ్దామని జగన్‌ను అడిగితే 'సీబీఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారు' అని చెప్పారని వెల్లడించారు. అరెస్టు, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టింది, కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదని సునీత తెలిపారు.
నిందితులను పట్టుకోవడంలో ఇంత జాప్యం ఏ కేసులో లేదన్న సునీత సీబీఐపైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారని, కేసు దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టి భయపెట్టారని వివరించారు. కర్నూలులో అవినాష్‌ను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారని గుర్తు చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించిన పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే జగనన్న ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని నిలదీశారు.