YS Sharmila Questions to Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఆస్తుల వివాదం ముదురుతోంది. తాజాగా ఆస్తుల వ్యవహారంలో జగన్‌కు షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. చట్ట విరుద్ధమని తెలిసినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మర్చిపోయారని, అందుకే ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుందని తెలిపారు.
నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని షర్మిల మండిపడ్డారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకూ తీసుకెళ్లారన్నారు. ఆస్తులను లాక్కోవటానికి, ఈడీ కేసులని, బెయిల్ క్యాన్సిల్ అవుతుందని కారణాలు చెబుతున్నారని, కానీ అవేవీ వాస్తవం కాదని స్పష్టం చేశారు.
సరస్వతీ కంపెనీ షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేయలేదని, అది కేవలం రూ. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే ఎటాచ్ చేసిందని తెలిపారు. కంపెనీ షేర్లను ఎప్పుడూ ఎటాచ్ చేయలేదని, ఏ సమయంలోనైనా వాటిని బదిలీ చేసుకోవచ్చని షర్మిల అన్నారు. ఏ కంపెనీ ఆస్తులనైనా ఈడీ ఎటాచ్ చేసినా, ఆ కంపెనీ షేర్ల బదిలీని మాత్రం ఎప్పుడూ ఆపలేదని, స్టాక్ మార్కెట్లలో ఉన్న చాలా కంపెనీలు కూడా వాటి ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసినవి ఉన్నాయని పేర్కొన్నారు. అయినా వాటి ట్రేడింగ్ అవుతోందని, షేర్లు బదిలీ కూడా అవుతున్నాయన్నారు.