YS Sharmila criticized CM Jagan: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా ఆరోపించారు. గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో షర్మిల బస్సు యాత్రలో పాల్గొన్న ఆమె సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్ కి వివేకా అలా ఉండే వారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యింది. ఎవరు చంపారో సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని వాపోయారు. చనిపోయింది వైఎస్ఆర్ తమ్ముడు, హంతకులను కాపాడుతున్నది జగన్ మోహన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్ లో కర్ఫ్యూ సృష్టించారని చెప్పారు.
సీఎం జగన్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఆర్టీపీపీని అదానీ, అంబాణీలకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తే ఆర్టీపీపీని మాయం చేస్తారని ఆరోపించారు. ఇదే థర్మల్ ప్లాంట్ లో 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం జగన్ గారు పాదయాత్ర కొచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తొలి సంతకం ఇదే అవుతుంది అని చెప్పారని పేర్కొన్నారు. కానీ జగన్ తాను ఇచ్చిన హామీ మరిచారని ఎద్దేవా చేశారు.