YS Sharmila Comments On YS Jagan : ఏపీ అసెంబ్లీకి వెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ధ్వజమెత్తారు.
ఇంతకుమించిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవని విమర్శించారు. మోసం చేయడం జగన్‌కు కొత్తేమీ కాదని, కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయడం, అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనంగా అభివర్ణించారు.
YS Sharmila Comments :ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక కావడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే, తాపీగా ప్యాలస్‌లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని ట్వీట్ చేశారు.