YS JAGAN TO ATTEND ASSEMBLY: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తే చూడాలని సొంత పార్టీ నేతలతో పాటు కూటమి నేతలు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చివరిగా ఆయన ఏడు నెలల క్రితం అసెంబ్లీకి వచ్చారు. అప్పటి నుంచి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఎందుకు రావడం లేదు అని మీడియా ప్రతినిధులు ఏమైనా ప్రశ్నిస్తే, తనకి ప్రతిపక్షం కావాలంటూ చిన్నపిల్లోడిలా మారాం చేస్తూ కూర్చున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను ప్రెస్మీట్లో మాట్లాడతానని, ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. తద్వారా తనకు ఎక్కువ టైమ్ మాట్లాడటానికి అవకాశం ఉంటుందని అన్నారు. కానీ అవేవీ కూడా ప్రజలకు ఆయనను దగ్గర చేయలేకపోయాయి. ఆయన ఎన్ని ప్రెస్మీట్లు పెట్టినా అవి వర్కౌట్ అవ్వలేదు.
దీంతో ఎట్టకేలకు వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 24వ తేదీ (సోమవారం) ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ సమయానికి సభకు హాజరు కావాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి రావాలంటూ వైఎస్సార్సీపీ అధిష్ఠానం సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
జగన్ మోహన్ రెడ్డి చివరిసారిగా గతేడాది జులైలో అసెంబ్లీ సమావేశాలప్పుడు రెండు రోజులు వచ్చారు. తర్వాత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాలేదు. ఇక ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం తర్వాతి రోజు నుంచి అసెంబ్లీకి హాజరవుతారా లేదా గతంలో మాదిరే చేస్తారా అన్నది స్పష్టత లేదు. మరోవైపు జగన్ రాకుండా ఎమ్మెల్యేలను మాత్రం సభకు పంపించే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరులో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి మీడియా ద్వారా మాట్లాడారు.