YouTuber Praneeth Hanumanthu was Arrested : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్ హనుమంతును సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది : యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఓ యూట్యూబ్ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్ చేసిన విషయం తెలిసిందే. అతనితో పాటు మరో ముగ్గురు యువకులు కలసి వేర్వేరు చోట్ల కూర్చుని ఒక రీల్ గురించి లైవ్‌లో మాట్లాడారు. ఆ రీల్లో ఒక తండ్రి, కుమార్తె ఉంటారు. తండ్రి కూతురు మధ్య అసభ్యకర సంబంధం అనే అర్థం వచ్చేలా సంభాషించారు.
ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సినీనటుడు సాయిదుర్గ తేజ్ దారుణంగా వీడియోలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో పాటు మరికొందరికి ఆయన ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఆదేశించారు. ఆ వెంటనే మంత్రి సీతక్క, సినీ నటుడు మంచు మనోజ్ రియాక్టు అయి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.