Online Cricket Betting In Telangana :ఆన్లైన్ బెట్టింగ్ ప్రాణాలు తీస్తోంది అంతే కాదు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తుంది. తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బెట్టింగ్‌కు అలవాటుపడ్డ ఇంజినీరింగ్ విద్యార్థి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ. 25 లక్షల అప్పు చేసిన అతను ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పందెం కాశాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చివరికి ఉరేసుకున్నాడు. ఇదొక్కటే కాదు బెట్టింగ్ మహమ్మారి ఎన్నో దారుణాలకు కారణమవుతోంది. మరో కేసులో బెట్టింగ్‌కు అలవాటుపడ్డ రత్నకిశోర్ అనే యువకుడు లోన్ యాప్‌లో రుణం తీసుకున్నాడు.
బెట్టింగ్ కోసం చోరీలు : గతేడాది ప్రపంచకప్ సందర్భంగా భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి తన యజమాని తల్లి ఒంటిపై బంగారు ఆభరణాలను కొట్టేయాలనుకున్నాడు. వృద్దురాలు నిద్రించగానే ఊపిరాడకుండా చేసి బంగారు గాజులు తీసుకుని పరారయ్యాడు. చివరకు ఆదిభట్ల పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. గత నెలలో కేపీహెచ్‌బీ పోలీసులు ఓ దొంగను అరెస్టు చేశారు. చోరీలు ఎందుకు చేస్తున్నావని పోలీసులు ప్రశ్నించగా బెట్టింగ్‌కు డబ్బు కోసం చోరీ చేస్తున్నట్లు చెప్పాడు. ఇతను పోలీసు స్టేషన్ నుంచి పరారవ్వడం అప్పట్లో కలకలం రేపింది.
ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ - రూ. 43లక్షల సొమ్ము స్వాధీనం - Cricket betting gang arrest
కీసర పోలీసులకు ఇటీవల బైకు దొంగ దొరికాడు. వాహనాలు ఎందుకు దొంగిలిస్తున్నావని అడగగా ఆన్లైన్ బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చేస్తున్నట్లు చేస్తున్నట్లు అంగీకరించాడు. బెట్టింగ్ ఒకప్పుడు ఖరీదైన వ్యవహరంగా గుట్టుగా నడిచేది. ఆన్లైన్ యాప్‌లు, వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాక ఈ మహమ్మారి స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ప్రారంభంలో పెట్టుబడికి వందలు, వేలు లాభాలు రావడంతో ఆశపడుతున్న కొందరు లక్షల్లో పందెం కాస్తున్నారు. వీటిని తీర్చడానికి అప్పులు చేస్తున్నారు.
చివరకు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురై క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి బెట్టింగ్ యాప్‌లు పూర్తిగా మోసపూరితం. పందెం కాసినప్పుడు తొలుత లాభాలు ఇచ్చేలా యాప్‌ల అల్గారిథమ్ ఉంటుంది. క్రమంగా ఎక్కువ పెట్టుబడి పెట్టాక విత్‌డ్రా చేయడానికి వీల్లేకుండా చేస్తారు. అప్పటికే పెట్టిన డబ్బు తీసుకోవడానికి యువత స్థోమతకు మించి అప్పులు చేస్తారు. నిర్వాహకులు చివరకు నష్టపోయేలా చేస్తారు.