Man Seeking Help after Suffering From Spine Broken :జీవచ్ఛవంలా పడి ఉన్న ఇతని పేరు గుగులోతు రమేశ్. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లతండాకు చెందిన ఈయనకు భార్య, కుమారుడు ఉండగా కూలీ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెండేళ్ల క్రితం మామిడి కాయలు కోసేందుకు కూలీగా వెళ్లాడు. విధి వక్రికరించి ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు.
వెంటనే ఆస్పత్రికి సూర్యాపేటకు తరలించగా వెన్నపూస దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్‌లో పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికిత్స అందించారు. వెన్నుముకకు శస్త్రచికిత్స చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదు. ప్రమాదం జరిగినప్పటి నుంచి రమేశ్ నడుము కింది భాగం పనిచేయట్లేదు. ఎలాంటి స్పర్శా లేదు. తనంతట తాను లేచి కూర్చోలేడు, నడవలేడు. మంచం నుంచి లేవాలంటే ఒకరి సాయం కావాలి. ప్రస్తుతం అతడిని భార్య చంటి బిడ్డలా చూసుకుంటోంది.
'ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడిపోయా. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్తే వెన్నపూస విరిగింది, ఆపరేషన్ చేస్తే నడుస్తే నడుస్తావ్ లేదంటే లేదు అని అన్నారు. ఆసుపత్రి ఖర్చు మొత్తం రూ.10 లక్షల వరకు అయ్యింది. ప్రస్తుతం మంచం మీదే జీవచ్ఛవంలా పడి ఉన్నా. దీంతో అప్పుల పాలయ్యాం. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుకుంటున్నా'-రమేశ్, బాధితుడు