Young Man Dies During Constables Physical Fitness Test: రాష్ట్రంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో గురువారం జరిగిన 1600 మీటర్ల పరుగు పందెంలో యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడు ఏ.కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్ (25)గా గుర్తించారు. ఈ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు చంద్రశేఖర్ మచిలీపట్నం వచ్చాడని తన స్నేహితుడు గోపి చెప్పారు. స్నేహితుడి మృతితో గోపి కన్నీటి పర్యంతమయ్యాడు. తన స్నేహితుడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని గోపి తెలిపారు. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
స్పందించిన ఎస్పీ: పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థి మృతి చెందడంపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఈరోజు మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారని, పరుగు పందెంలో పాల్గొని నాలుగో రౌండ్లో ఉన్న సమయంలో హఠాత్తుగా కింద పడిపోయాడని వివరించారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి బాధితుడిని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అన్నారు. చికిత్స తీసుకునే సమయంలో కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారని ఎస్పీ ప్రకటనలో తెలిపారు.