APSRTC Earned Record Revenue During Sankranti Festival Season: సంక్రాంతి పండగ సీజన్లో ఏపీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 11 రోజుల పాటు 9 వేల 97 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ గణనీయంగా ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈనెల 20న ఒకేరోజు 23.71 కోట్ల ఆదాయం పొంది రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో మరో మూడు రోజుల పాటు రోజుకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ వెల్లడించింది.
ఒకే సీజన్లో రోజుకు రూ.20 కోట్లకు పైగా చొప్పున 3 రోజులు ఆదాయం పొందడం తొలిసారని ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి సీజన్ మొత్తంలో ప్రత్యేక బస్సుల ద్వారానే రూ. 21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది. పండగ సీజన్లో మొత్తం 7200 బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించిన ఆర్టీసీ, ప్రయాణికుల రద్దీ వల్ల అంతకన్నా ఎక్కువగా 9097 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపింది.
డ్రైవర్లు, కండక్టర్ల అంకిత భావం, కృషి ఫలితంగానే ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సంక్రాంతి సీజన్లో ప్రత్యేక బస్సులన్నీ సాధారణ చార్జీలతో నడిపామని, సాధారణ చార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణికులు విశేషంగా ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనమని ఎండీ తెలిపారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే మొగ్గు చూపారని, ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణను ఎప్పటికీ మరచిపోలేనిదని తెలిపారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులందరికీ డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేక దన్యావాదాలు తెలిపారు.
ముందస్తు ప్రణాళికతోనే సాధ్యమైంది: ప్రయాణికుల ఆదరణతో సంక్రాంతి సీజన్లో ఆర్టీసీకి మంచి లాభాలు వచ్చాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో సాధారణ టికెట్ చార్జీతోనే ఆర్టీసీ సేవలు అందించిందన్నారు. సంక్రాంతికీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే ప్రణాళికలు చేసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం సంక్రాంతి పండగ ప్రయాణికులకు ఎంతో తోడ్పాటు అందించిందన్నారు. ఎపీఎస్ ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పండగొచ్చింది - 7200 ప్రత్యేక బస్సులు - సాధారణ ఛార్జీలతోనే ప్రయాణం
ఆర్టీసీ శుభవార్త : అదనపు ఛార్జీల్లేకుండానే 'సంక్రాంతి' స్పెషల్ బస్సులు