Cheating on Constable Physical Fitness Test in Kurnool : కానిస్టేబుళ్ల నియామక దేహదారుఢ్య పరీక్ష ప్రక్రియలో మోసానికి పాల్పడి ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయి జైలుపాలైన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులకు కర్నూలు పట్టణంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో గత కొన్ని రోజులుగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం 600 మందికిగాను 412 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరందరికీ ముందుగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరించి అర్హత పత్రాలతోపాటు ఎత్తు, ఛాతీ కొలతలు పరిశీలించారు. తరువాత 1,600, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ నిర్వహించారు. అయితే వీరిలో ఒక యువకుడు మాత్రం అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు.
సాంకేతికత పట్టించింది :కోసిగి మండలం దొడ్డిబెళగల్‌కు చెందిన పి.తిరుమల సరైన ఎత్తు, ఛాతీ కొలతలు లేకపోవటంతో తదుపరి పరీక్షలకు అర్హత కోల్పోయాడు. అతనికి ఇచ్చిన హాల్‌టికెట్ పత్రంలో అనర్హుడిగా అధికారులు గుర్తులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అతను నకిలీ హాల్‌టికెట్ సృష్టించుకుని అందులో అర్హుడైనట్లు గుర్తులు నమోదు చేసుకున్నాడు. అనంతరం 1,600 మీటర్ల పరుగు పరీక్షలో పాల్గొనేందుకు వచ్చాడు. ముందుగా హాల్‌టికెట్‌ను కంప్యూటర్ ఆపరేటర్‌కు ఇవ్వగా అతని వివరాలను కంప్యూటరులో పరిశీలించారు.
అందులో ఎత్తు, ఛాతీ కొలతల్లో అర్హత కోల్పోయినట్లు నమోదై ఉండటంతో అనుమానంతో అతను తీసుకొచ్చిన హాల్‌టికెట్‌ను నిశితంగా పరిశీలించగా నకిలీదిగా నిర్ధారించుకున్నారు. మోసానికి యత్నించిన విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. ఆర్‌ఐ నాగభూషణ ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి తిరుమలను అదుపులోకి తీసుకున్నారు.