Heavy Rain Alert to Telangana :పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం 8:30 గంటలకు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద ఈనెల 9న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో మోస్తారు వర్షాలతో పాటు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ఈ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త : ఈ నెల 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 9న అతి భారీ వర్షాలు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.