YCP Leader Pinnelli Ramakrishna Reddy Bail Petition In High Court : బెయిలు షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వివిధ కేసులలో నిందితుడిగా ఉండి విదేశాలకు పారిపోయిన తన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కలిసేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిలు షరతులను సడలించాలని కోరుతున్నారని పోలీసుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ రద్దు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. నోటీసులు అందజేయడానికి వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేరన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేర చరిత్ర ఉందన్నారు. బెయిలు షరతును సడలించవద్దని కోరారు.
నవంబర్ 4న తగిన ఉత్తర్వులు : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ, కుమారుడి చదువు నిమిత్తం పిటిషనర్ సింగపూర్ వెళ్లాల్సి ఉందన్నారు. మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించిన పాస్‌పోర్టును తిరిగి ఇప్పించాలని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారంలో ఓసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు అవుతున్నారన్నారు. విదేశాలకు వెళ్లాల్సిన నేపథ్యంలో హాజరు షరతును సడలించాలని కోరారు. పిటిషనర్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలా? లేదా? అనేది విచారణ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 4న ఈ పిటిషన్లపై తగిన ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు.