YCP Govt Taking Rs 7 Thousand Crore Loans Through APMDC:ఎన్నికల కోడ్ ప్రకటన వచ్చేలోపు మరో 7 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మైనింగ్ శాఖ ద్వారా రుణం సమకూర్చుకునేందుకు దస్త్రాన్ని కదిపింది. దీనికి నేడో, రేపో అన్‌లైన్‌లో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మైనింగ్ శాఖ పేరుతో రుణం తీసుకుంటున్నా ఆ సొమ్మంతా ప్రభుత్వమే తీసుకోనుంది.
బడా కంపెనీకి అనుకూలంగా బీచ్ శాండ్ టెండర్ నిబంధనలు- దరఖాస్తు ధరే రూ.5 లక్షలు!
చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు బాండ్ల ద్వారా రుణం:రుణాల కోసం ఏ అవకాశాన్నీ జగన్ ప్రభుత్వం వదలట్లేదు. వీలైనంత తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నా ఈ లోపే 7 వేల కోట్ల రూపాయల రుణం తీసుకునే ప్రయత్నంలో పడింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ- ఏపీఎండీసీ (AP Mineral Development Corporation) ద్వారా ప్రైవేటు బాండ్ల రూపంలో 7 వేల కోట్ల రుణం సమకూర్చుకునేందుకు శరవేగంగా దస్త్రాన్ని కదిపింది. ఆఘమేఘాలపై మంత్రివర్గ ఆమోదం తీసుకునేందుకు సిద్ధమైంది. ఏపీఎండీసీ చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు బాండ్ల ద్వారా రుణం తీసుకోనున్నారు. అదీ ఏపీడీఎంసీ అవసరాల కోసం కాకుండా ప్రభుత్వానికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరుతూ దస్త్రాన్ని రూపొందించారు. దీన్ని రెండురోజుల క్రితం ప్రభుత్వానికి పంపారు.