YCP Government Neglected Fish Landing Centre : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బియ్యపుతిప్ప వద్ద ఫిష్ ల్యాండింగ్ కేంద్రం వస్తుందని చుట్టుపక్కల ప్రాంతాల మత్స్యకారులు సంతోషపడ్డారు. జీవనోపాధి మెరుగుపడుతుందని, తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశ పడ్డారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రానికి శంకుస్థాపన చేయడంతో తమ ఆశ నెరవేరనుందని ఎదురుచూశారు. అయితే అంతలోనే ప్రభుత్వం మారడంతో గత వైఎస్సార్సీపీ సర్కార్ ఆ ప్రాజెక్టును అటకెక్కించింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తీర ప్రాంత వాసులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రాజెక్టుని అటెకెక్కించిన వైఎస్సార్సీపీ : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు మండలాల పరిధిలో దాదాపు 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. వేల మంది మత్స్యకారులు గోదావరి నదితో పాటు సముద్రంలో వేటకు వెళ్లి మత్స్య సంపదను అమ్మకుని జీవనం సాగిస్తుంటారు. అయితే బోట్లు నిలిపేందుకు అనువైన స్థలం, మత్స్యసంపదను నిల్వ చేసుకునేందుకు గోదాములు, విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలు లేక గంగపుత్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం ప్రభుత్వం నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ఫిష్ ల్యాండింగ్ కేంద్రం ఏర్పాటుకు అంకురార్పణ చేసింది. 2018 లో మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. 6 ఎకరాల స్థలం సేకరించి తొలి విడత నిధులు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసి స్థలాన్ని చదును చేసి మెటీరియల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టుని అటెకెక్కించింది.
కలగానే మిగిలిన ఫిష్ ల్యాండింగ్ కేంద్రం : వాస్తవానికి ఈ ప్రాంతంలో హార్బర్ నిర్మించాలని తొలుత భావించారు. కానీ గోదావరి సముద్రంలో కలిసే సంగమ ప్రాంతం కావడంతో మలుపు కారణంగా పూడిక ఏర్పడి పెద్ద పెద్ద ఓడలు నిలిపేందుకు కష్టమవుతుందని ఫిష్ ల్యాండింగ్ నిర్మాణానికి నిర్ణయించారు. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ హార్బర్ నిర్మిస్తామంటూ గొప్పలు చెప్పింది. ఐదేళ్లు కాలయాపన చేసి ఎన్నికల ముందు చినమైనవానిలంక వద్ద సముద్రం ఒడ్డున కార్గో పోర్టు నిర్మిస్తామని అప్పటి సీఎం జగన్ ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. 2 అడుగుల మేర చిన్న గొయ్యి తవ్వి అదే కార్గో పోర్టు అన్నట్లు వదిలేశారు. దీంతో తమ చిరకాల కోరికైన ఫిష్ ల్యాండింగ్ కేంద్రం కలగానే మిగిలిపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాన్ని పట్టాలెక్కించాలని కోరుతున్నారు.