Yadadri Temple Facilities :ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి (Yadadri Lakshmi Narasimha Swamy Temple) ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించేందుకు సమాయత్తం అవుతోంది.
కొన్ని సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిపై అధ్యయనం చేయించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వద్దకు ప్రతిపాదనలు వచ్చాయి. త్వరలోనే మంత్రి ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం అధ్యయనానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Yadadri Lakshmi Narasimha Swamy Temple :మరోవైపు సదుపాయాలపై భక్తుల నుంచి స్పందన (ఫీడ్‌బ్యాక్)ను ఏవిధంగా తీసుకుందామన్న అంశంపై అధికారులు మేదోమథనం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా కియోస్క్‌లను ఏర్పాటు చేయడమా? ఆన్‌లైన్ ద్వారా స్పందనను నమోదు చేయడమా? అన్న అంశాలపై త్వరలో స్పష్టత రానున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ ద్వారా భక్తుల స్పందనను తెలుసుకునే విధానం ఇప్పటివరకు లేదు. ఈ విధానాన్ని అమలుచేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిరుజల్లుల్లో యాదాద్రి ఆలయం.. ఎంత అద్భుతంగా ఉందో..?
సొంత వాహనాలపై కింకర్తవ్యం :యాదాద్రి(Yadadri Temple) కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ మినీ బస్సులతోపాటు వ్యక్తిగత వాహనాలను అనుమతిస్తున్నారు. రూ.500 చెల్లిస్తే వ్యక్తిగత వాహనాలను పైకి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు 500-600 వ్యక్తిగత వాహనాలు కొండపైకి వెళుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో పార్కింగ్ సమస్య రావడంతోపాటు కొండపైన కాలుష్యం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.