Yadadri Collector Sudden Inspection in Gurukula School :యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రిన్సిపల్ రాజాపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో పనితీరు మారకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రిన్సిపల్, సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్‌లో సమస్యలపై విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆహారంలో నాణ్యత, శుభ్రత లోపిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్వయంగా పరిశీలన : ఈ నేపథ్యంలో కలెక్టర్ తనిఖీలు ఆసక్తికరంగా మారాయి. విద్యార్థులు వినియోగించే రోజువారీ నీరు ఎలా ఉందని కలెక్టర్ స్వయంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మీదకు ఎక్కి పరిశీలించారు. నీరు అపరిశుభ్రంగా ఉన్నాయని ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై ఆరా తీశారు.
తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ : ప్రిన్సిపల్, స్టాఫ్‌తో కలెక్టర్ హనుమంతరావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పలు విషయాలపై అసహనం వ్యక్తం చేశారు. వారం రోజులలో అందరీ పనితీరు మారకపోతే చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. విద్యార్థులతో వంటపనుల్లో పనిచేయిస్తే చర్యలు ఉంటాయన్నారు. విద్యార్థులతో అర్థమయ్యేట్లు మాట్లాడి వారి ప్రతిభ ఆధారంగా పాఠాలు చెప్పాలని సూచించారు.