తెలంగాణ

telangana

ETV Bharat / state

మూసీ అభివృద్ధి పనిలో ముందడుగు - ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణానికి అనుమతి! - WORLD BANK LOAN FOR MUSI RIVERFRONT

మూసీ రివర్​ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టులో ముందుడగు - ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి

World Bank Loan On Musi Riverfront
World Bank Loan For Musi Riverfront (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 12:48 PM IST

World Bank Loan For Musi Riverfront Development Project : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టులో ముందుడగు పడింది. ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయ అనుమతి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. రుణ ఒప్పందానికి ముందే డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. త్వరలోనే డీపీఆర్‌లు పూర్తిచేయించి కేంద్రం, ప్రపంచ బ్యాంకుకు అందించేందుకు మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సిద్ధమవుతోంది.

ప్రపంచబ్యాంకు నుంచి రుణం : మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ప్రపంచబ్యాంకుకి సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అందించాలని, రుణ ఒప్పందానికి ముందే డీపీఆర్​లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించి సిఫార్సులు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచబ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

డీపీఆర్‌లు సమర్పించాలని తెలిపిన కేంద్రం : ఈ మేరకు సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి ప్రభుత్వం అందించింది. ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరిట పంపిన ప్రాథమిక నివేదికలో నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక, పర్యాటక వృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

హైదరాబాద్‌ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని, ఆ నదిని పునరుజ్జీవం చేస్తే జీవవైవిధ్యం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేందుకు తోడ్పడుతుందని వెల్లడించింది. నదిలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని తెలిపారు. పనులు పూర్తయ్యాక మూసీకి ఇరువైపులా నగర స్వరూపమే మారిపోతుందని, ప్రగతికి కొత్త కేంద్రాలు ఏర్పడతాయని వెల్లడించింది.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి : మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి నాలుగు ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మురుగునీటి శుద్ధీకరణ, వరదనీరు సవ్యంగా వెళ్లేలాచూడటం, వర్షపు నీరు, మురుగునీరు కలవకుండా చర్యలు, లాండ్‌స్కేప్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నట్లు వివరించింది. లాండ్‌స్కేప్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా నదిని యథాస్థితికి తేవడం, రివర్‌ ఫ్రంట్‌ పొడవునా ప్రజలకు సదుపాయాలు, రోడ్లు, రవాణాను మెరుగుపర్చడం వంటి అంశాలున్నాయి.

ప్రపంచబ్యాంకు రుణం :సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలోనూ దోహదపడుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇందులో వివిధ కార్యక్రమాలను చేపడతామని, 2030 డిసెంబరులోగా పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5,863 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. అందులో 4,100 కోట్లు ప్రపంచబ్యాంకు అప్పుగా ఇస్తే, మిగిలిన 1,763 కోట్లను రాష్ట్రమే భరిస్తుందని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగిందని వివరించింది.

అనుమతులు, పునరావాసం వంటి అన్నిఅంశాలతో ఇచ్చిన ప్రాథమిక నివేదిక పరిశీలించిన కేంద్రం ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ముందడుగు పడినట్లు అయింది. డీపీఆర్‌ల తయారీ బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించిన మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ త్వరలోనే వాటిని పూర్తిచేయించి కేంద్రం, ప్రపంచబ్యాంకుకు అందించనున్నట్లు తెలిసింది.

అందరినీ మురిపించేలా మూసీ! - మరి భారం పడకుండా ఎలా?

సీఎం రేవంత్‌రెడ్డి 'మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర' షెడ్యూల్​ ఇదే!

ABOUT THE AUTHOR

...view details