woman Crack Five Government Jobs :ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు కొలువు కోసం ఎంతో మంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. గంటల కొద్ది పుస్తకాలతో పోటీ పడుతూ కఠోర ధీక్ష చేస్తున్నారు. ఇలాంటి పోటీ తరుణంలో మొక్కవోని దైర్యంతో నిలబడి, పట్టుదలతో చదివింది ఈ యువతి. గురుకుల ఫలితాలలో డీఎల్(DL), జేఎల్, పీజీటీ(PGT), టీజీటీ, టీజీటీ సోషల్‌తో సహా అయిదు ఉద్యోగాలు సాధించింది. జనరల్ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యంగా ముందుకుసాగుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు రాజశేఖర్ శర్మ, పావనిల కుమార్తె అమరవాది మృణాళిని.
తాతయ్య, నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో ఈ యువతికి చిన్ననాటి నుంచే చదువుపై మక్కువ. తండ్రి తెలుగు పండితుడు కావడంతో చిన్నప్పటి నుంచి తండ్రే గురువుగా, శిక్షకుడిగా మారాడు. మాతృభాష ఆవశ్యకత గురించి తను చెప్పిన పాఠాలు మృణాళిని మెదడులో నాటుకుపోయి, ఉన్నత లక్ష్యం చేరాలన్న దిశగా తన అడుగులు పడ్డాయి. కోచింగ్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా సార్లు వింటూనే ఉంటాం. కానీ ఈ చదువుల ఆణిముత్యం ఏలాంటి కోచింగ్ లేకుండా 5 ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకుంది. లైబ్రరీ, దిన పత్రికల సాయంతో తన విషయ పరిజ్ఞానాన్ని దినదినాభివృద్ది చేసుకుంటూ ముందుకుసాగింది.
Gajwel Woman got Five Government Jobs without Coaching : రానున్న తరాలకు తన వంతుగా తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను పంచాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ యువతి. మృణాళినికి చిన్నప్పటి నుంచి పద్యాలు, కావ్యాలు అంటే ఏంతో ఇష్టం. తండ్రి రాసిన పద్యాలు కంఠస్తం చేసేది. నాన్న అంత పేరు, ప్రఖ్యాతలు సంపాధించాలని చిన్ననాటి నుంచే లక్ష్యంగా పెట్టుకుని చదివింది. చదువుకునే సమయం నుంచే తొలినాళ్లలో పాఠశాలల్లో, అనంతరం కళాశాలల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. పీజీ పూర్తి చేసిన మృణాళిని నెట్(NET), సెట్ పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రావి సీతాదేవి రామాయణం పద్య కావ్యంపై పీహెచ్డీ చేస్తుంది.
తనకు వచ్చిన అయిదు అవకాశాల్లో డీఎల్(DL) ఉద్యోగం వైపు ఆసక్తి చూపుతోంది ఈ యువతి. కోచింగ్ అనేది కేవలం ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే సహయపడుతుందని, కోచింగ్ తీసుకోకుండా పోటీ పరీక్షలలో నెగ్గలేము అనే అపోహలు పెట్టుకోవద్దని నిరుద్యోగులకు సూచిస్తోంది. తమపై తమకి నమ్మకం ఉన్న వ్యక్తులకు ఎలాంటి కోచింగ్‌లు అవసరం లేదంటోంది. సబ్జెక్ట్ పెంచుకోవడానికి ఎన్ని పుస్తకాలు చదివామన్నది ముఖ్యం కాదని, సరైన పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివామన్నదే ముఖ్యం అని చెప్తోంది ఈ యువతి. సర్కారు కొలువే లక్ష్యంగా చదివిన ఈ యువతకి కుటుంబసభ్యులు ఏంతో ప్రోత్సాహన్ని అందించారు.