Wife Kills Husband in Bapatla District :మద్యం మత్తులో తన భర్త చేస్తున్న వికృత చర్యలు భార్యను హంతకురాలిగా మార్చేశాయి. తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తాళికట్టిన భర్త ప్రాణాలు తీసేందుకూ వెనకాడలేదు ఆ మహిళ. ఏపీలో వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే,
నడిరోడ్డుపై ఉరి బిగించి మరీ : బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్ర బాబు (38)కు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. భర్త వేధింపులు తాళలేక అరుణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అమరేంద్ర బాబును మందలించి పంపించేశారు. మంగళవారం అమరేంద్ర బాబు మద్యం మత్తులో జేబులో చాకు పెట్టుకుని అరుణ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. తనను చంపేస్తాడన్న ఉద్దేశంతో అరుణ కర్రతో భర్త తలపై బలంగా కొట్టింది. కిందపడ్డ అతడికి తాడు కట్టి నడి రోడ్డుపైకి ఈడ్చుకు వెళ్లింది. ఆపై మెడకు ఉరి బిగించి హత్యకు పాల్పడింది.
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ : అరుణ అమరేంద్ర బాబుకు ఉరి బిగించి చంపేసిన ఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నిందితురాలు అరుణ పరారీలో ఉందని పోలీసులు చెప్పారు.