Ankapur Desi Chicken Special Story :నాన్‌వెజ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఉన్న అంకాపూర్. చుట్టూ పచ్చని పంటచేలు.. నగరాన్ని తలపించేలా అందమైన భవనాలతో కొలువుదీరిన ఈ గ్రామం పేరు మస్త్ ఫేమస్ అయింది. అందుకు ప్రధాన కారణం.. ఇక్కడ ప్రత్యేకంగా వండే దేశీ నాటుకోడి కూర. బయట ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా.. ఇతర చోట్ల ఎక్కడ తిన్నా ఈ చికెన్ కర్రీ రుచి రాదు. అంతేకాదు.. ఆ మార్గంలో ప్రయాణిస్తే మాత్రం తినకుండా వెళ్లరనడం అతిశయోక్తి కాదు. అలాగే.. చుట్టుపక్కల ఎక్కడ సమావేశాలు, విందులు ఉన్నా.. ఈ ఊరు నాటుకోడి కూర విధిగా ఉండాల్సిందే. అయితే, అసలు.. "అంకాపూర్ చికెన్" వరల్డ్ వైడ్ అంతలా ఫేమస్ అవ్వడం వెనుక దాగి ఉన్న కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దాదాపు 45 నుంచి 50 ఏళ్ల కిందట గ్రామంలో మొదట తాళ్లపల్లి రామాగౌడ్ అనే వ్యక్తి ఈ నాటుకోడి కూర వండటం స్టార్ట్ చేశారు. ఈయన చేసే చికెన్ కారంగా, ఘాటుగా అద్భుతమైన టేస్ట్ ఉండటంతో.. స్థానికంగా అందరి నోళ్లలో పడి మెల్లమెల్లగా జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు పాకింది. ఇది తినేందుకే ఆదివారాలు ఇక్కడికి వచ్చే వారూ ఉన్నారు. రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో కుటుంబమంతా ఆర్డర్ మీద కావాల్సిన వాళ్లకు పంపించే బిజినెస్ కొనసాగించారు. క్రమంగా ఊర్లో ఇతరులూ ఆర్డర్ మెస్‌లు ప్రారభించారు.
అంతేకాదు.. వ్యవసాయరంగంలో అంకాపూర్కి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడంతో ఇక్కడికి రైతులు, సందర్శకులు నిత్యం వందల మంది వచ్చిపోతుంటారు. పాతికేళ్లుగా దేశ విదేశాల అతిథులు ఇక్కడికి వచ్చి రైతులు చేస్తున్న వినూత్న వ్యవసాయంపై అధ్యయనం చేసి స్థానిక రుచులను ఆస్వాదించి వెళ్తుంటారట. అలా.. అంకాపూర్‘దేశీ చికెన్’గా ఇక్కడి వంటకం ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది.
టేస్ట్‌లో బెస్ట్.. నేటికీ తగ్గని క్రేజ్! : అంకాపూర్ చికెన్‌ను ఒక్కసారి టేస్ట్ చేసిన ఎవరైనా సరే ఈ మార్గంలో ప్రయాణిస్తే తినకుండా వెళ్లరు. అంతేకాదు.. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చే ఏ అధికారి అయినా, పొలిటల్ లీడర్ అయినా తప్పకుండా లంచ్‌లో ఈ చికెన్ రెసిపీ ఉండేలా చూసుకుంటారట. అలాగే.. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల మీటింగ్స్‌కి భోజనాల్లో అంకాపూర్ చికెన్‌ను ప్రిఫర్ చేస్తున్నారంటే.. దీని క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తయారీ కోసం ప్రత్యేకంగా మసాలాలు :అంకాపూర్ నాటుకోడి కూర వండేందుకు మసాలాలు ప్రత్యేకంగా ఎప్పుటికప్పుడు తయారు చేసుకుంటారు. లవంగాలు, ధనియాలు, కొబ్బరి పొడి, యాలకులు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లి, పుదీనా, కొత్తిమీర వంటకానికి ముందే దంచి పెట్టుకుంటారు. అలాగే.. వంటలో వాడేందుకు నాణ్యమైన నూనె ఉపయోగిస్తారు.