Telangana Govt to Pay RS 500 Bonus Paddy : ఇప్పుడు వరి పండించే ఏ రైతు నోట విన్నా బోనస్ మాటే వినిపిస్తుంది. సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అందులోనూ కొన్ని రకాల ధాన్యాల పేర్లు చెప్పి, వాటినే సన్నాలుగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే అలాంటి విషయాలు ఏవీ రైతులకు తెలియడం లేదు. ఈ విషయాల్లో రైతులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ఏ రకం వరికి బోనస్ ఇస్తారు? వాటి కోసం ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలో వర్షాకాలం వరి ధాన్యాన్ని పౌర సరఫరాల, సహకార, ఐకేపీ, మార్కెట్ కమిటీ అధికారులు ఇప్పటికే సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించనుంది. అయితే ఈ బోనస్‌ను కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే బోనస్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సన్నాల్లోని 33 రకాలకు ఈ బోనస్‌ను వర్తింపజేశారు.
ధాన్యాన్ని కొలిచి :ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం గింజ పొడవు, వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మైక్రో మీటర్లను ఏర్పాటు చేశారు. పొడవు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ, వెడల్పు రెండు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కాకుండా ఉండాలి. ధాన్యం తేమ 17 శాతానికి మించనప్పుడు మాత్రమే కొనుగోలుకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటికే రూ.500 బోనస్‌ను ఇవ్వనున్నారు.