What is the Meaning of TMC and CUSEC :ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో వరద నీటితో డ్యాములు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండు కుండలా కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టులకు, నదులకు వరద నీరు చేరినప్పుడల్లా టీఎంసీ, క్యూసెక్ అనే పదాలను ప్రతి ఒక్కరు వార్తల్లో వినడం, వార్త పత్రికల్లో చడవడం చేస్తుంటాం. కానీ టీఎంసీ, క్యూసెక్ అంటే చాలా మంది తెలియదు.
నీటి పారదల శాఖ అధికారులు సైతం ఈ వర్షాలకు శ్రీశైలం జలాశయంలో ఇన్ని టీఎంసీల నీరు చేరిందని, ఇంత క్యూసెక్కుల నీటిని రైతుల పంట పొలాల అవసరాలకు విడుదల చేస్తున్నామని చెబుతుంటారు. నీటి నిల్వ గురించి చెప్పేట్పపుడు టీఎంసీలలో, నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి చెప్పేట్పపుడు క్యూసెక్కులలో చెబుతారు. అసలు ఎన్ని లీటర్ల నీరు అయితే టీఎంసీ, ఎన్ని లీటర్ల నీరు అయితే క్యూసెక్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీఎంసీ (TMC) :రిజర్వాయర్లలో, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిమాణం టీఎంసీలలో చెబుతుంటారు. అంటే నీటిని కొలిచేందుకు టీఎంసీ అనే షార్ట్ కట్ పదాన్ని ఉపయోగిస్తారు. టీఎంసీ (TMC) అంటే వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు (Thousand Million Cubic Feet ). అంటే వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల పొడవు, వెయ్యి అడుగుల ఎత్తు అని అర్థం. లీటర్లలో పరిగణిస్తే ఒక టీఎంసీ దాదాపు 2,881 కోట్ల లీటర్లు (ఘనపుటడుగులు) ఉంటుంది. దాదాపు 2,300 ఎకరాల విస్తీర్ణంలో ఒక్క అడుగు నీరు చేరితే అది ఒక్క టీఎంసీకి సమానంగా పరిగణించవచ్చు.
క్యూసెక్ (CUSEC) : ఇక క్యూసెక్ అంటే నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ఒక ప్రమాణం. క్యూసెక్ (CUSEC) అంటే సెకనుకు ఒక ఘనపు అడుగు (Cubic Feet Per Second) అని అర్థం. దీని విలువ సెకనుకు 28 లీటర్ల అవుతుంది. బ్యారేజ్ గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశామంటే ఒక సెకను కాలంలో గేట్ల ద్వారా 28 లక్షల లీటర్ల నీరు విడుదలైందని అర్థం. "క్యూసెక్" అనే పదం లాటిన్ పదం "సెకస్" నుంచి ఉద్భవించింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తాగు,సాగు నీటి కోసం వాడే నీటి పరిణామం కేవలం 2 నుంచి 3 వేల టీఎంసీల లోపే ఉంటుంది. కాని ప్రాజెక్టుల నిర్మాణం, స్టోరేజీ కెపాసిటీ లేక మనం వాడుకునే టీఎంసీల నీటి కంటే , కొన్ని రెట్ల టీఎంసీల నీటిని మనం సముద్రంలోకి వదిలేస్తాం. ఈ నీటిని కూడా ఒడిసిపట్టుకుంటే, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు. దీనికి కావల్సిందల్ల రాజకీయంగా నిర్ణయాలు, అందుకు తగ్గట్టుగా చిత్తశుద్ది ఉండాలి.