D.ED Education In Other States: తెలంగాణ విద్యార్థులు ఏపీలో డీఈడీ చేయడానికి సందేహపడుతున్నారు. ఈ సర్టిఫికెట్ తెలంగాణలో ఈ ఏడాది నుంచి చెల్లుబాటు కాదని కొందరు విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీసీ, బీఎస్సీ, బీఈడీ అర్హతతో ఏ రాష్ట్రంలోనైనా చెల్లుబాటయ్యే కోర్సులేవి? వాటి గురించి తెలుసుకుందాం.
వేరే రాష్ట్రంలో డీఈడీ :విద్యార్థులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా మరో రాష్ట్రం నుంచి డిగ్రీ కానీ, డిప్లొమా కానీ చదవడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని కెరియర్ కౌన్సెలర్ ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పొందిన డిగ్రీ, డిప్లొమాల చెల్లుబాటు గురించి ప్రస్తావన లేదన్నారు. యూజీసీ గుర్తింపు ఉన్న అన్ని డిగ్రీలు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి చేసిన బీఈడీ/ డీఈడీ దేశవ్యాప్తంగా చెల్లుతాయని తెలిపారు.
షిల్లాంగ్, మైసూరు, భువనేశ్వర్, అజ్మీర్‌లో, భోపాల్ ఉన్న రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లలో, దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో వివిధ రాష్ట్రాల విద్యార్థులు బీఈడీ శిక్షణ పొందుతున్నారన్నారు. వీరిలో చాలామంది శిక్షణ అనంతరం సొంత రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని, ఎంపికవుతున్నారన్నారు. కాబట్టి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో డీఈడీ చేయడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.