Deepavali Name Village in AP : భారతీయ పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో ఎంతో సరదాగా జరుపుకొంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీలోని ఆ గ్రామాన్ని ఏకంగా దీపావళి పేరుతోనే పిలుస్తారు. ఇది గ్రామ ప్రజలు పెట్టుకున్నది, మార్చుకున్నది కాదు. వందల ఏళ్ల నుంచి ఆ ఊరుకు ఆ పేరే కొనసాగుతోంది. ఇది జిల్లా కేంద్రానికి 9 కిలో మీటర్ల దూరంలో ఉంది.
ఇంతకీ ఈ ఊరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే : పూర్వం ఈ ప్రాంతానికి శిస్తు వసూలుకు వచ్చిన ఓ నవాబు గుర్రంపై అటుగా వెళ్తూ దారి మధ్యలో స్పృహ తప్పి పడిపోయాడట. అప్పుడు స్థానికులు సేవలు చేసి కోలుకునేలా చేశారట. దీంతో వారికి కృతజ్ఞతలు తెలిపిన నవాబు, ఆ గ్రామానికి శిస్తు విధానాన్ని రద్దు చేయాలని తలిచాడు. ఈమేరకు ఆ గ్రామం పేరు అడగ్గా, గ్రామస్థులు తెలియదని బదులిచ్చారు. ఆ ఘటన జరిగిన రోజు దీపావళి వేడుక కావడంతో ఆ పేరునే గ్రామానికి పెట్టారని, నాటి నుంచి అదే కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఆ ఊళ్లో 70 ఏళ్లుగా దీపావళి జరుపుకోరు : మరోవైపు ఉత్తరాంధ్రాలోని మరో గ్రామం ఏకంగా 70 ఏళ్లుగా దీపావళి జరపుకోవటం లేదు. అసలు దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చిన్నా పెద్దా అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా వేడుకగా అంతా జరపుకుంటారు. కానీ అనకాపల్లి జిల్లా కిత్తంపేట గ్రామం దాదాపుగా 70 ఏళ్లుగా దీపావళికి దూరంగా ఉంటోంది. ఎందుకని ఆరా తీస్తే స్థానికులు ఇలా చెబుతున్నారు.
ఈ కిత్తంపేట గ్రామం రావికమతం మండలం, జడ్.బెన్నవరం పంచాయతీలో ఉంది. 450 ఇళ్లు, 1500 జనాభా ఉంటారు. శివారు గ్రామమైనప్పటికీ జనాభా పరంగా జడ్.బెన్నవరం కంటే పెద్దది. రాజకీయంగా చైతన్యవంతం కావడంతో ఈ గ్రామం వారే సర్పంచులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ గ్రామవాసులంతా దీపావళి పండుగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తమ చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ టపాసులు కాల్చలేదని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
టపాసుల వల్లే :
"గతంలో అందరిలాగే మా ఊరిలోనూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకొనేవారు. 70 ఏళ్ల కిందట ఊరంతా పూరిగుడిసెలు ఉండేవి. గడ్డివాములు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇంటి ముందరే ఉండేవి. దీపావళి పర్వదినాన దివిటీలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి మా ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. వేల సంఖ్యలో మూగజీవాలన్నీ మృత్యువాతపడ్డాయి. అప్పట్నుంచి అన్నీ అపశకునాలే జరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా దీపావళి టైంలోనే మరణాలు ఎక్కువగా సంభవించేవి. కీడు జరుగుతోందని నాటి పెద్దలు దీపావళికి దీపాలు వెలిగించడం పూర్తిగా నిషేదించారు. ఎవరూ వేడుక చేసుకోవద్దని నిర్ణయించారు. అదే ఆనవాయితీగా వస్తోంది."- కర్రి అర్జున, మాజీ సర్పంచ్
వెలుగుల పండుగ వేళ : టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవొద్దు!
పండుగ పూట విషాదం - బాణాసంచా పేలి వ్యక్తి మృతి - ఛిద్రమైన శరీరం