West Godavari Karthika Masam Special Food :సంస్కృతి అంటే గోదావరి. సంప్రదాయమంటే గోదారి లోగిళ్లు. గోదారోళ్లు చేసే ప్రతిదానికి ఓ విధానం ఉంటుంది. అందులో కార్తిక మాసమంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఉసిరి చెట్టుకు పూజలు, దీపారాధన, వన భోజనాలు సందల్ల తీరే వేరు. అక్కడ వడ్డించే విస్తరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
వనమంతా జనం. పశ్చిమ వనసమారాధనలో వడ్డించే వంటలన్నీ అమోఘం. అరమీటరుకు పైగా ఉన్న అరటాకును అడ్డ విస్తరిగా పరిచి ఒక్కో పదార్థం వడ్డిస్తుంటే అబ్బా అనిపిస్తుంది. అలా నేతి బొబ్బట్లతో మొదలవుతుంది. దాని పక్కన బూరుగుపల్లి బెల్లంతో చేసిన బూరి కారం, తగిలీ తగలనట్టుగా వాము బజ్జీ మొదటి వరుసలో వడ్డిస్తారు. మంచీ చెడ్డ మాట్లాడుతూ అతిథులు శ్రద్ధగా వీటిని తినేస్తారు. ఆ తర్వాత ఆవ పెట్టిన పులిహోర, కమ్మని కొబ్బరన్నం, కొసరి కొసరి కొత్తిమీర రైసు వడ్డిస్తుంటే భోజన ప్రియుల్లో కన్నార్పని జిహ్వచాపల్యం శివతాండవమాడుతుంది. దోసకాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, మామిడితో కలిపి చేసిన కొబ్బరి పచ్చడి వేడి అన్నంతో కలిపి తింటే లోకాన్నే మైమరిచిపోతాం. కందిపొడి, కరివేపాకు పొడివంటి వంటకాలపై కమ్మని నెయ్యి వడ్డిస్తుంటే తెలియకుండానే నోట్లో నుంచి ఇంకొంచెం వెయ్యి అనకుండా ఉండలేరు సుమీ.
కార్తికమాసం స్పెషల్ : ఉల్లి, వెల్లుల్లి లేని "వంకాయ తవా ఫ్రై" - చిటికెలో చేసుకోండిలా!