Water Conservation in Hyderabad :ఎండకాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. కానీ ఈ కాలనీ వాసులు సుమారు 25 సంవత్సరాల క్రితమే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ భోలక్‌పూర్ డివిజన్‌లోని పద్మశాలి కాలనీలో గత కొన్నేళ్లుగా భూగర్భ జలాలు అడుగంటిన దాఖలాలు లేవు. ఇప్పటికీ కొందరి నివాసాల్లో బోర్లకు జెట్ పంపులనే వాడుతున్నారు. ఆ కాలనీలో భూగర్భ జలాలు కేవలం 31 అడుగుల్లోనే ఉండడం విశేషం. మండుటెండల్లోనూ బోర్లలో నీరు పుష్కలంగా ఉంది.
Precautions to Avoid Water Crisis : నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై హైకోర్టు సైతం హెచ్చరించిన నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని వివరిస్తున్నారు. వర్షపు నీరు వృథా కాకుండా సంరక్షణ (Water Preservation) నిబంధనలు పాటిస్తే భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయొచ్చంటున్నారు కాలనీవాసులు. దీనికి ప్రధాన కారణం ఈ కాలనీలో 25 ఏళ్ల క్రితమే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఏటా వర్షాకాలంలో వర్షపు నీరు పైపుల ద్వారా వచ్చి ఇంకుడు గుంతల్లో చేరి భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయి.
జల సంరక్షణపై బాధ్యత గుర్తు చేసిన హైకోర్టు - ప్రభుత్వం ఏ విధమైనా చర్యలు తీసుకోవాలి?
నీటి ఎద్దడి సమస్యే ఎదురు కాలేదు :1998 జూలై 31న తొలిసారి ఐదు ఇళ్లలో ఇంకుడు గుంతలను ప్రయోగాత్మకంగా నిర్మించారు. సత్ఫాలితాలు ఇవ్వడంతో క్రమేణ ఇంటింటా ఇంకుడు గుంతలను స్వచ్ఛందగా నిర్మించుకున్నారు. 2010 నాటికి ఆ కాలనీలో దాదాపు 80 శాతం మంది ఇళ్లలో ఇంకుడు గుంతలు (Rainwater Harvesting Pits)ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి వేసవిలో వాటికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి నీటి ఎద్దడి అనే సమస్యే ఎదురు కాలేదంటున్నారు.