తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యాటకులతో వెళ్తున్న బోటులోకి నీరు - పాపికొండల విహార యాత్రలో తప్పిన పెను ప్రమాదం - PAPI HILLS IN ANDHRA PRADESH

పాపి కొండల మధ్య గోదావరి నదిపై అధిక సంఖ్యలో పర్యాటకులతో వెళ్లిన బోటు - నిర్వాహకుల అప్రమత్తమవడంతో తప్పిన ప్రమాదం

PAPI HILLS IN ANDHRA PRADESH
ఇంజన్​ పైపు పగలడంతో ఒడ్డుకు చేరిన పర్యాటక బోటు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 11:52 AM IST

Papi hills in East Godavari : గోదావరి నదిపై పర్యాటకులతో పాపికొండల విహార యాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటులోకి నీళ్లు చేరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యాటకులు, బోటు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం నుంచి ఆదివారం (నవంబర్ 17) అధిక సంఖ్యలో పర్యాటకులతో పాపికొండల విహారయాత్రకు బోట్లు బయలుదేరి వెళ్లాయి. విహారయాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటు కచ్చులూరు- మంటూరు మధ్యకు వచ్చే సరికి, గోదావరి నదిలో నుంచి బోటు ఇంజిన్‌లోకి నీటిని తోడి కూలింగ్‌ చేసి బయటకు పంపించే పైపు (కూలింగ్‌ పైపు) పగిలిపోవడంతో బోటులోకి కొంతమేర నీరు చేరింది.

అప్రమత్తంతో తప్పిన ప్రమాదం : దీంతో బోటులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అక్కడికి సమీప తీరానికి బోటును సురక్షితంగా చేర్చారు. బోటులోకి చేరిన నీటిని బయటకు తోడి పంపించేశారు. అనంతరం పర్యాటకులను సురక్షితంగా అక్కడికి దగ్గరలోని పోశమ్మ గండికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై బోటు నిర్వాహకులు వెంటనే తమకు సమాచారం అందించారని పర్యాటక శాఖ కంట్రోల్‌ రూం అధికారి ఒకరు చెప్పారు. బోటు నిర్వాహకులు అప్రమత్తమవడంతో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది.

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి పాపికొండల విహార యాత్ర దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడి నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరాంటాలపల్లిలోని ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి నది చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ చూడడానికి కళ్లకు చాలా రమణీయంగా కనిపిస్తుంది.

భద్రాచలం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం చేసి పేరంటాలపల్లికి చేరవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ పాపికొండల పర్యాటకం విహారయాత్రలకు 2021 జూలై 1 న ప్రభుత్వం అనుమతించింది. ఈ పాపి కొండలను పలు సినిమాల చిత్రీకరణకు కూడా దర్శకులు ఉపయోగించుకున్నారు. సీతారామయ్యగారి మనువరాలు, గోదావరి, అంజి లాంటి మొదలైన చిత్రాల షూటింగ్​ జరిగింది.

పాపికొండల విహారయాత్ర - రద్దీ దృష్ట్యా ఆన్​లైన్​లో టికెట్లు బుక్ చేసుకోవాలని బోట్ టూరిజం సూచన

నాగార్జునసాగర్ టూ శ్రీశైలం 'లాంచీ ప్రయాణం' షురూ - టికెట్ ధరలు సహా పూర్తి వివరాలివే

ABOUT THE AUTHOR

...view details