ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు - పలువురిపై ఈసీ వేటు - Volunteers Election Code Violation

Volunteers Election Code Violation : వాలంటీర్ల తీరు మారడం లేదు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి యథేచ్చగా వైసీపీ నేతల సమావేశంలో పాల్గొంటున్నారు. దీనిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వేటు వేస్తున్నారు. ఉద్యోగులు ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Volunteers in Violation of Election Code
Volunteers in Violation of Election Code

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 11:59 AM IST

Volunteers Election Code Violation:రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నా వాలంటీర్లు, అధికార పార్టీ నేతలు వాటిని ఖాతరు చేయడం లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 13 మంది వాలంటీర్లు తొలగింపునకు గురయ్యారు. ఎస్‌. కోట మండలం అలుగుబిల్లిలో వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో పాటు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లను తొలగించినట్టు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి వెల్లడించారు. పాచిపెంట మండలం పాంచాలిలో ఈ నెల 19న వైసీపీకి మద్ధతుగా గ్రామ వాలంటీర్లు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నట్లు ఆర్వోకి ఫిర్యాదులు అందాయి. దీంతో సాలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ప్రచారంలో పాల్గొన్న 11మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ లక్ష్మీకాంత్ వెల్లడించారు.

యధేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు - అధికార పార్టీ ప్రచారంలో వాలంటీర్లు, ఇతర సిబ్బంది

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇద్దరు గ్రామ వాలంటీర్లపై ఈసీ కొరడా ఝుళిపించింది. కోడూరులో వైసీపీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న గ్రామ వాలంటీర్ చిట్టిప్రోలు నాగేంద్రబాబును తొలగించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఇద్దరు గ్రామ వాలంటీర్లను తొలగించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నలుగురు వాలంటీర్లను, వీఆర్​వోపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధులత వేటు వేశారు. అయినా లెక్క చేయకుండా కొందరు వాలంటీర్లు, ఉపాధి హామీ సిబ్బంది, రేషన్ డీలర్లు ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తూ రాజకీయ పార్టీల ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

బరితెగించిన వాలంటీర్లు- కోడ్​ ఉల్లంఘించి వైఎస్సార్సీపీ ప్రచారంలో డ్యాన్స్​లు

శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ నేతలు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పంచాయతీ ఉపాధి పథక క్షేత్ర సహాయకుడు సరోజ్‌వర్మ పాల్గొన్నారు. బొడ్డపాడుకు వైసీపీ నాయకులు ఓ చెరువు వద్ద ప్రచారం నిర్వహించగా వారితో కలిసి సరోజ్‌వర్మ అక్కడే ఉన్నారు. మందస మండలం భోగాపురం పంచాయతీ కుసిపద్ర జగన్నాథపురానికి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు అగ్గున దేవేంద్రపై సస్పెన్షన్‌ వేటు పడింది. దేవేంద్ర వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయమై ఈనాడులో వార్త ప్రచురితమవ్వడంతో పలాస ఆర్డీవో భరత్‌నాయక్‌ స్పందించారు. దీనిపై విచారణ చేపట్టి దేవేంద్రను విధుల నుంచి తొలగించామని ఈ విషయాన్ని ఎంపీడీవోకు ఉత్తర్వులు పంపించినట్లు తెలిపారు.

వైసీపీకి ప్రచారం చేస్తున్న వాలంటీర్ - వైరల్ అవుతున్న వీడియో

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో వాలంటీర్లు పాల్గొంటున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకుని మమా అనిపిస్తున్నారు. ఈనెల 16వ తేదీన ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా చేబ్రోలు,పెద్దకాకాని మండలాల్లో పొన్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సుమారు 150 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.

చేబ్రోలులో 2 గ్రామాల నుంచి వాలంటీర్లు హాజరయ్యారని, పెదకాకాని నుంచి కేవలం 8 మంది వాలంటీర్లు మాత్రమే హాజరయ్యారని పంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నివేదిక అందజేశారు. వాస్తవానికి 2 మండలాలోని అన్ని గ్రామాల నుంచి వాలంటీర్లు పాల్గొన్నప్పటికీ కేవలం 2 గ్రామాలకు చెందిన వారినే మాత్రమే తొలగించడంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ కనుసన్నుల్లోనే ఇంకా పని చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈసీ ఆదేశాలు లెక్కచేయని సచివాలయ ఉద్యోగులు - సామాజిక మాధ్యమాల్లో వైసీపీ అనుకూల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details