Vizianagaram People Problems in Jagan Government : ‘అన్నదాతలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వాలు బలంగా ఉంటాయని రాజశేఖరరెడ్డి బిడ్డ అధికారంలోకి వస్తే తోటపల్లి కుడి, ఎడమ కాలువలు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ 2018లో విజయనగరం జిల్లా పాదయాత్రలో జగన్ రైతులకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేసి హడావుడి చేశారు తప్ప ముందడుగు లేదు. కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కన పెట్టారు. ‘ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు టెంకాయ కొడితే మోసమంటారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు’ అంటూ సూక్తి ముక్తావళి వినిపించిన జగన్ నాలుగేళ్ల పాటు జాప్యం చేసి ఎన్నికలకు ఏడాది ముందు శంకుస్థాపనలు చేశారు. కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కనపెట్టిన సీఎం ఏం అభివృద్ధి చేశారని చెప్పడానికి జిల్లాకు మళ్లీ వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
తోటపల్లి ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రైతులను జగన్ దగా చేశారు. నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి బడ్జెట్‌లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రాజెక్టుపై సమీక్షించే తీరిక సీఎంకే కాదు జిల్లా మంత్రులకూ లేకపోయింది. ఇప్పటికీ పునరావాస సమస్యలు వెంటాడుతున్నాయి. అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయం నిర్మాణానికి టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు తోటపల్లి రెగ్యులేటర్ కింద సాగవుతున్న 64 వేల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని 132 గ్రామాల పరిధిలో 64 వేల 36 ఎకరాలకు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 155 గ్రామాల్లో 67వేల 912 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా మరో 10 వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఆ తరువాత వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం లో చేర్చినా పనులు ముందుకెళ్లలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం 480 కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులకు 287 కోట్లు వెచ్చించారు. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 465 కోట్లు కేటాయించి 61 కోట్లే వెచ్చించింది. నిధులివ్వకపోవడంతో ప్రాజెక్టు పడకేసింది.
No Development in Vizianagaram :భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను జగన్ ప్రభుత్వం నాలుగేళ్లు పక్కనపెట్టి ఎన్నికలకు ఏడాది ముందు హడావుడి చేసింది. విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో పూర్తి చేయాలని టీడీపీ హయాంలో నిర్ణయించారు. 2019 ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైకాపా సర్కారు నాలుగేళ్లపాటు దీని ఊసెత్త లేదు. ఎట్టకేలకు గతేడాది మే 3న సీఎం జగన్ విమానాశ్రయ పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం సేకరించిన సుమారు 2వేల 700 ఎకరాల్లో 500 ఎకరాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని మిగిలిన 2వేల 200 ఎకరాలను విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించారు. ఎయిర్‌పోర్టుకు తారకరామతీర్థసాగర్ నుంచి నీటి సరఫరాకు 198 కోట్లతో పనులు పూర్తి చేస్తామని ప్రకటించి రూపాయి మంజూరు చేయలేదు. విమానాశ్రయానికి భూములిస్తే పరిహారంతోపాటు అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయి. నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం కొత్త ఇళ్ల పునాదుల పనులకే సరిపోలేదు. వలస వెళ్లిన వారికి, గ్రామాలు ఖాళీ చేసేనాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని జగన్ మోసం చేశారు.