Land Resurvey In Andhra Pradesh : యజమానుల సమక్షంలోనే భూములను రీసర్వే చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడుసార్లు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అప్పటికీ రాకుంటే వీడియోకాల్ ద్వారా ప్రక్రియను పూర్తిచేస్తామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 20 నుంచి ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద రీ-సర్వే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. యజమానులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమ్యూనికేషన్ బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రతి బ్లాకులో 200 నుంచి 250 ఎకరాలు : గ్రామాన్ని బ్లాకులుగా విభజించి, ప్రతి బ్లాకులో 200 నుంచి 250 ఎకరాలకు మించకుండా చూస్తామని అనగాని అన్నారు. కొలతలు వేయడానికి ప్రతి బ్లాక్‌కు ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, ఒక వీఆర్‌ఏ ఉంటారని స్పష్టం చేశారు. ఈ బృందం సర్వే నంబర్ల ఆధారంగా భూముల యజమానులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేస్తుందన్నారు. సర్వేనంబర్ల వారీగా రీ-సర్వే నిర్వహణ గురించి సమాచారాన్ని యజమానులు దీని ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. రోజుకు 20 ఎకరాల చొప్పున 15 రోజుల్లో సర్వే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హడావుడి ఉండకూడదన్న ఉద్దేశంతో దాన్ని పొడిగిస్తూ 25 రోజుల వరకు సమయం ఇస్తున్నామని మంత్రి అనగాని వెల్లడించారు.
ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ : "భూమి వద్దకు సర్వేయర్ల బృందం తప్పనిసరిగా వెళ్లాలి. యజమానులు వారి పొలం వద్దకు వచ్చినప్పుడు తీసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అధికారులు నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తుంది. పైలట్ గ్రామాల్లో రీ-సర్వే నిర్వహణ తీరుపై నిశిత పరిశీలన చేసిన అనంతరం మిగిలిన చోట్ల కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం" అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.