Young Woman Suicide in Bheemili :సమాజంలో రోజురోజుకు ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు. వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామని వెంటపడి మోసం చేసేవారు కొందరు. ఆ ప్రేమను కాదంటే కాలయములుగా మారి ప్రాణాలు తీస్తున్నారు. వారికి చట్టమన్నా లెక్కలేదు, శిక్ష పడుతుందనే భయం లేదు క్రూరత్వానికి ఉన్మాదం తోడై కొందరు ప్రేమ పేరిట అత్యంత కిరాతకంగా పేట్రేగిపోతున్నారు. ఈ తరహా దుశ్చర్యలకు తెగబడితే తమ జీవితం నాశనమైపోతుందన్న భయం కొరవడి ఆటవికంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా విశాఖపట్నం జిల్లాలో ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు కొన్ని సంవత్సరాలుగా ఆమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు.
ఈ నేపథ్యంలో విసుగు చెందిన యువతి పొలాల్లో జల్లడానికి ఇంట్లో భద్రపరిచిన పురుగుల మందును ఈనెల 16వ తేదీ సాయంత్రం తాగింది. ఇంట్లోని వారు గమనించి తగరపువలస ఎన్నారై ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మృత్యువుతో పోరాడుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది. శుక్రవారం ఉదయం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. యువతి మృతికి కారకుడైన రాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు. కాగా ఈ విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. దీనిపై సీఐ సుధాకర్ వివరణ కోరగా మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు.