Huge Crocodile in Wanaparthy : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో భారీ మొసలి కలకలం సృష్టించింది. ఓ ఇంటి ముందున్న సీతాఫలం చెట్టు వద్ద శబ్ధం రావడంతో కవిత అనే మహిళ వెళ్లి చూసింది. చెట్టు పొదల్లో భారీ మొసలి కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేస్తూ పరుగెత్తింది. దీంతో గ్రామస్థులు అక్కడకు వెళ్లి చూడగా భారీ మొసలి కదులుతూ కనిపించింది. వెంటనే అక్కడి స్థానికులు స్నేక్ సొసైటీ నిర్వాహకులు అయిన కృష్ణ సాగర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అటవీ శాఖ అధికారులతో కలిసి దాదాపు 11 ఫీట్ల పొడవు 230 కిలోల బరువున్న భారీ ముసలిని తాళ్లతో బంధించారు. అనంతరం గ్రామానికి దగ్గరగా ఉన్న కృష్ణా నదిలో మొసలిని విడిచిపెట్టారు.
సమీపంలో ఉన్న వరద కాలువ నుంచి మొసలి ఇళ్ల మధ్యకు వచ్చి ఉంటుందని ఫారెస్ట్ సెక్షన్ అధికారిణి రాణి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీటి ప్రవాహం తగ్గడం వల్ల సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి, ఇళ్లల్లోకి మొసళ్లు వచ్చే అవకాశం ఉందని ప్రజలందరూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.