Vijayawada Gradually Recovering From Flood Water : వారానికి పైగా వరద నీటితో అల్లాడిపోయిన విజయవాడ క్రమంగా కోలుకుంటోంది. వరద నీటి నుంచి కాలనీలు క్రమంగా బయటపడుతున్నాయి. వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ముంపు ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. అలాగే ప్రతి ఇంటికీ ఆహారం, రేషన్ సరుకులు, నిత్యావసరాల వస్తువుల పంపిణీ వేగంగా సాగుతోంది. ఆపద కాలంలో ప్రభుత్వం ఆదుకుంటోందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు :సింగ్‌నగర్ సహా చాలా కాలనీల్లో వరద తగ్గుముఖం పట్టింది. ఇంకా వరద వీడని ప్రాంతాల్లో ఇంజిన్లు, మోటార్లతో తోడుతున్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ముంపు ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. 32 డివిజన్లలో మురుగు, చెత్త తొలగింపు చేపడుతున్నారు. ముంపుబారినపడిన 70 శాతానికి పైగా ఇళ్లల్లోని నీటిని ఇప్పటికే తోడేశారు. రహదారులను రాకపోకలకు అనుకూలంగా శుభ్రం చేస్తున్నారు. నడుము లోతు వరకు ఉన్న ప్రాంతాలకూ పారిశుద్ధ్య కార్మికులు, వాహనాలను పంపించి చెత్త, వ్యర్థాలు తొలగిస్తున్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు.
తక్కువ ధరకు అందుతున్నాయా? లేదా? : ఇంటింటికీ ఆహారం, రేషన్ సరుకుల పంపిణీ జోరుగా సాగుతోంది. నిత్యావసరాల కిట్లను పెద్దఎత్తున పంపిణీ చేస్తున్నారు. నిత్యావసరాలు పంపిణీ జోరుగా సాగుతోంది. నిత్యావసర వస్తువుల పంపిణీని మంత్రి అచ్చెన్నాయుడు పర్యవేక్షించారు. తక్కువ ధరకు కూరగాయలు అందుతున్నాయా? లేదా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్టినగర్ ఆహార, నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. సంచార రైతు బజార్ల ద్వారా వరద బాధితులకు అతి తక్కువ ధరలకే కూరగాయలు అందిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కూరగాయలు కొనుగోలు చేశారు. ఆపద కాలంలో ప్రభుత్వం నిత్యావసరాలు, కూరగాయలు అందించి ఆదుకుంటోందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.