Janwada Farmhouse Case Update :రాష్ట్రంలో సంచలనం రేపిన జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు విజయ్ మద్దూరి పోలీసు విచారణకు హాజరయ్యారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో మోకిల పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన విజయ్‌ని పోలీసులు మధ్యాహ్నం 1.40 గంటల వరకు విచారించారు. సోదాల సందర్భంగా పోలీసులకు సహకరించకపోవడం, ఇతరుల ఫోన్ ఇవ్వడం, కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం చుట్టూ పోలీసుల విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. విచారణ చేసిన పోలీసులు విజయ్ స్టేట్‌మెంటు రికార్డు చేసుకుని పంపించారు.
జన్వాడ ఫాంహౌస్ పార్టీ : మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల తన ఫాంహౌస్‌లో నిర్వహించిన మద్యం పార్టీలో విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో కేసు మొత్తం ఆయన చుట్టే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనిచ్చిన స్టేట్‌మెంట్ కీలకంగా మారుతుందని, దీని ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సోదాల సందర్భంగా పోలీసులకు సహకరించకపోవడం, ఇతరుల ఫోన్ ఇవ్వడం, కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం చుట్టూ పోలీసుల విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. 26వ తేదీ అర్థరాత్రి ఫాంహౌస్‌లో సోదాలు చేసినప్పుడు విజయ్‌ని ఫోన్ ఇవ్వాలని పోలీసులు కోరారు.
పోలీసుల ప్రశ్నలు :విజయ్ మాత్రం తన ఫోన్‌కు బదులు పార్టీలో పాల్గొన్న మరో మహిళ ఫోన్ ఇచ్చాడు. ఇతరుల ఫోన్ ఎందుకిచ్చారని పోలీసులు ప్రశ్నించగా తాను మద్యం మత్తులో టేబుల్ మీద ఉన్న ఫోన్ ఇచ్చానని విజయ్ చెప్పినట్లు సమాచారం. మీ ఫోన్ ఏమైందని అధికారులు ప్రశ్నించగా పోగొట్టుకున్నానని ఎక్కడుందో ఇంకా తెలియలేదని, దాని కోసమే వెతుకుతున్నానని బదులిచ్చినట్లు తెలుస్తోంది. కొకైన్ ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టారు. పార్టీకి హాజరవ్వడానికి కొద్దిరోజుల క్రితం విదేశాలకు వెళ్లొచ్చిన విషయం ప్రస్తావించినట్లు తెలుస్తోంది.