Vigilance Inquiry on Secretariat IT Equipment Scam :కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా గ్లోబల్ టెండర్లతో సచివాలయంలో ఐటీ పనులు చేపట్టినట్లు విచారణలో తేలింది. పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. సచివాలయంలో రూ.270 కోట్లతో పనులు చేపట్టినా కొటేషన్లు అడగడం వరకే పరిమితం కావడం వెనక కారణాలపై విజిలెన్స్ లోతుగా ఆరా తీస్తోంది. ఇలా చేయడానికి ఐటీశాఖ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని భావిస్తోంది. సమయం లేకపోవడంతోనే ఇలా చేశామంటున్న వాదనలో డొల్లతనం ఉందని అనుమానిస్తోంది.
2020 జులైలో పాత సచివాలయాన్ని కూల్చేశారు. 2021 జనవరిలో కొత్త నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 మే 1ననూతన సెక్రటేరియట్లో (TS New Secretariat)కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. పాత సచివాలయాన్ని కూల్చేసిన తర్వాత దాదాపు మూడేళ్ల సమయం దొరికింది. నూతన సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్‌మెంట్ తప్పనిసరైనా ఆ విషయాన్ని ఐటీశాఖ గుర్తించకపోవడం వెనక కారణాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విశ్లేషిస్తోంది.
'కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు గుర్తించాం - విజిలెన్స్ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు'
చివరకు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసేందుకు కొద్ది రోజులు ముందుగా హడావుడిగా ఐటీ ప్రొక్యూర్మెంట్ కోసం కార్యాచరణ ప్రారంభించడంలో మతలబేమిటనే అంశంపై విజిలెన్స్ కూపీ లాగుతోంది. అయితే 2022 డిసెంబర్ 1న ఏడు రిజిస్టర్డ్ కంపెనీల నుంచి సామగ్రి కోసం కొటేషన్లు మాత్రం స్వీకరించారు. అనంతరం సమయం లేదంటూ టెండర్లకు వెళ్లకుండానే నామినేషన్లపై ఓ కంపెనీకి పని అప్పగించడంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆరా తీస్తోంది.
Telangana Secretariat Scam 2024 : కొత్త సచివాలయంలో అన్ని శాఖలకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలతోపాటు సెక్రెటేరియేట్ క్యాంపస్ ఏరియా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను ఐటీశాఖకు అప్పగించారు. ఇందుకు సంబంధించి గతంలోనే సుమారు రూ.180 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటిది దాదాపు అంతకు రెట్టింపు వ్యయంతో సచివాయలం ప్రారంభోత్సవ సమయంలో ఐటీ ప్రొక్యూర్‌మెంట్ పనులు పూర్తి చేశారు.