CV Anand Appeared Before PC Ghosh Commission : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, బుధవారం నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను హైదరాబాద్ బీఆర్కే భవన్లో విచారణ చేయనున్నారు. అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కమిషన్ తరఫున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ, వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
అదనపు సమాచారంపై ఆరా : మరోవైపు ఇవాళ విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి ఆయన వివరించారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని సీవీ ఆనంద్ కమిషన్‌కు తెలిపారు. మరికొన్ని అంశాల గురించి కూడా సీవీ ఆనంద్‌ను ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్, అదనపు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు విచారణపై తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం నీటి పారుదల శాఖ నుంచి తీసుకున్న దస్త్రాలు, వివరాలు కూడా కమిషన్ అడిగినట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, నీటి పారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.