Cyber Crime With Whatsapp Call: మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు అనుకోకుండా వాట్సాప్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఏదైనా ముఖ్యమైన కాల్ అని ఎత్తామంటే ఇక అంతే సంగతులు. అవతల అందమైన స్త్రీ నగ్నంగా మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. బాధితుడు స్క్రీన్‌మీద కనిపిస్తున్న వీడియోని రికార్డు చేస్తారు. అనంతరం బెదిరించే ప్రయత్నాలు మొదలుపెడతారు. నగ్న వీడియోను మీ కుటుంబ సభ్యులకు పంపుతామని, తెలిసినవారుండే గ్రూపుల్లో పెడతామని భయబ్రాంతులకు గురిచేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు.
దేశమంతటా సైబర్ నేరగాళ్లు ఈ కొత్త తరహా దోపిడీకి తెర లేపారు. పోలీసులు ఒకపక్క అవగాహన కల్పిస్తుంటే, కొత్త విధానాలతో నేరస్థులు తెగబడుతున్నారు. ఈ కొత్తరకం సైబర్‌నేరాలు చోటుచేసుకుంటున్న తీరు అందర్నీ ఆందోళన కలిగిస్తోంది.
ఎలా తప్పించుకోవచ్చు : గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దు. ఒకవేళ ఎత్తాల్సి వస్తే చేతి వేళ్లతో కెమెరాను మూసి లిఫ్ట్ చేయాలి. దీంతో మనం స్క్రీన్‌లో కనిపించకుండా జాగ్రత్త పడొచ్చు. వాళ్లు రికార్డు చేసే అవకాశం ఉండదు.
లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ :ఉచిత డేటా, ఐఫోన్ అంటూ ఆశలు రేకెత్తించే సందేశాలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. ఏమాత్రం వాటి కోసం క్లిక్ చేసినా బ్యాంకులో దాచుకున్న సొమ్మునంతా అప్పనంగా ఊడ్చేస్తారు. ఎవరూ ఏదీ ఉచితంగా ఇవ్వరనే విషయాన్ని గ్రహించాలి. ప్రజల మానసిక బలహీనతలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఆన్‌లైన్ ఉద్యోగం వర్క్ ఫ్రం హోం అంటూ నెలకు రూ.లక్షకుపైగా సంపాదించవచ్చు రోజుల వ్యవధిలో పెట్టుబడి రెట్టింపవుతుందని ఇలాంటి ప్రకటనలతో ఊరిస్తారు. వీటిని నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైం పోలీసులు పదే పదే చెబుతున్నారు. ఎవరైనా మోసపోతే ఒక గంట సమయంలోపు 1930 కి కాల్ చేసి వివరాలు చెప్పాలని సూచిస్తున్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ ఏడాది జులై చివరి నాటికి 292 ఫిర్యాదులు అందాయి. వీటిలో రూ.1.41 కోట్లు పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన సైబర్ నేరవిభాగం పోలీసులు రూ.25 లక్షలు నిందితులకు చేరకుండా బ్యాంక్‌లో హోల్డ్‌లో పెట్టించగలిగారు. - ఫణీందర్, డీఎస్పీ,సైబర్ క్రైమ్ పోలీస్, ఖమ్మం
ఇవి జరిగిన సంఘటనలు
- అధిక లాభాలు వస్తాయని ఫేస్బుక్లో వచ్చిన ప్రకటన నమ్మి ఖమ్మంలోని పాండురంగాపురానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు స్టాక్ మార్కెట్లో ఏకంగా రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టారు. అనంతరం కొద్ది రోజులకు మోసపోయానని గుర్తించి ఆగస్టు 13న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
- ఎస్బీఐ పేరుతో వచ్చిన లింకును క్లిక్ చేయటంతో పాటు వివరాలు నమోదు చేసి నగరంలోని ఖమ్మంలోని మధురానగర్‌లో నివసించే మరో ఉపాధ్యాయుడు రూ.73 వేలు పోగొట్టుకున్నారు. గత సెప్టెంబరు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- తల్లాడలో అక్టోబరు 18న అర్ధరాత్రి ఇద్దరు నాయకులకు వాట్సప్ న్యూడ్ కాల్స్ వచ్చాయన్న వార్త కలకలం సృష్టించింది.
- ఖమ్మంలో ప్రముఖులు కొందరు అక్టోబరు నెల్లో ఇటువంటి కాల్స్‌ను ఎదుర్కొన్నారు.
- వైరాకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి వాట్సాప్ కాల్ చేసి వీడియో రికార్డు చేసిన నేరస్థులు దాన్ని ఆయనకు పంపించారు. నగదు చెల్లించాలంటూ బెదిరించారు. దీంతో ఆయన నేర విభాగం పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంతర్రాష్ట్ర ఆపరేషన్ - 27 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ - IPS Shikha Goyal On Cyber Crimes
'అన్నీ దొరుకును - ఎవరికీ దొరకము' - నేరాలకు అడ్డాగా 'స్నాప్ చాట్' - Snapchat Crimes