Rahul Gandhi Tweet on Tirumala Laddu Issue in AP : తిరుమలలో లడ్డూల కల్తీపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ట్వీటర్ వేదికగా స్పందించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తనను ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పూజించే దేవుడు బాలాజీ అని పేర్కొన్నారు. అలాంటి ప్రసిద్ధ ఆలయంలో లడ్డూలు కల్తీ అయ్యాయన్న విషయం ప్రతి ఒక్క భక్తుడినీ బాధిస్తోందని తెలియజేశారు. దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని వ్యాఖ్యానించారు.
Former Vice President Venkaiah Naidu Response : తిరుమల శ్రీవారి ప్రసాదాలపై వస్తున్న వార్తలు తనను ఎంతో కలిచివేశాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు కోట్ల మంది భక్తులకు ఇలవేల్పు అని వ్యాఖ్యానించారు. స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమపవిత్రంగా భావిస్తారని పేర్కొన్నారు. అంతే కాదు ఆత్మీయులకు శ్రీవారి ఆశీస్సులు లభించాలని అందరికీ పంచిపెట్టడం ఆచారంగా వస్తోందని తెలియజేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక వైశిష్ఠ్యం కలిగిన తిరుమల వేంకటేశ్వరుడి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైనా క్షమార్హం కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించానని తెలియజేశారు. అందుకు సీఎం అంగీకరించారని పేర్కొన్నారు.
Actor Prakash Raj Comment :తిరుమల లడ్డూ కల్తీ అంశంపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఏపీలో ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై భక్తులపై భయాందోళనలు సృష్టించి జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో మతపరమైన ఉద్రిక్తతలున్నాయని తెలియజేశారు.