Vemuluru Bridge Submerged Due to Backwaters of Somasila : వైఎస్సార్ జిల్లాలోని వేములూరు వంతెనను సోమశిల వెనక జలాలు, సగిలేరు నది నీరు ముంచెత్తాయి. దీంతో వంతెనపై ప్రజలు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలు కారణంగా పెన్నా నది నీరు సోమశిల జలాశయంలో వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయంలో 73 టీఎంసీల నీటిని నిలువరించారు.
జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. సోమశిల జలాశయంలో నీటిమట్టం పెరిగినప్పుడల్లా వెనక వైపున ఉన్న వేములూరు వంతెన పూర్తిగా మునిగిపోతుంది. ఇలా కొన్ని నెలల పాటు నీరు నిలబడి ఉంటంవల్ల వంతెనపై పాచిపట్టి పాదచారులు ప్రమాదవశాత్తు కిందపడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు.
15 ఏళ్లుగా ఇదే దుస్థితి : అట్లూరు మండలంలోని ఏటికి అవతలో ఉన్న మన్యంవారిపల్లి, మాడపూరు, ముత్తుకూరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు పెరిగినప్పుడల్లా 40 కిలోమీటర్లు బద్వేలు చుట్టి అట్లూరు మండల కేంద్రానికి చేరుకోవలసిన దుస్థితి ఏర్పడింది. రాను పోను 20 రూపాయలు అయ్యే రవాణా ఖర్చు ఇప్పుడు రూ. 200 అవుతోంది. దీంతో పేద ప్రజలకు భారంగా మారింది.